అర్థం లేని రాజశేఖర్ ఆగ్రహం

Rajasekhar's outburst has no reasoning
Thursday, January 2, 2020 - 15:30

మంచిని లౌడ్ స్పీకర్ లో చెపుదాం.... చెడుని చెవిలో చెపుదాం. 

ఈ రోజు "మా" డైరీ 2020 ఆవిష్కరణ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట ఇది. "మా"లో కొన్నాళ్లుగా చెలరేగుతోన్న వివాదాల గురించి ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి ఆ మాట అన్నారు. వివాదాలు, లుకలుకల గురించి బహిరంగంగా మాట్లాడి మన పరువు మనమే తీసుకోవద్దు అని చిరంజీవి తన తోటి మా సభ్యులకి సూచించిన సజెషన్. ఇది మంచి మాటే.

ఐతే ... ఆ తర్వాత మైక్ అందుకున్న రాజశేఖర్ ఆగ్రహంగా మాట్లాడారు. "సమస్యలని కవర్ చేస్తే సమస్యలు కాకుండా పోవు. నిప్పుని ఆపినా పొగ వస్తుంది.. అంటూ రాజశేఖర్ తన యాంగ్రి మేన్ అవతారం చూపించారు. నిజానికి చిరంజీవి చెప్పిందే... ఇలాంటి ఆవేశమొద్దు అనే. ఒకరిని ఒకరు తిట్టుకోవడం వల్ల టాలీవుడ్ పరువు పోతోందనేదే చిరు మాట. 

"మా" అసోసియేషన్ ఏమైనా అసెంబ్లీ.. 700 మంది సినిమా నటుల సంఘం సమస్యల గురించి... జనం అందరూ తెలుసుకోవాలా? వాళ్లలో వాళ్ళు సరిచేసుకుంటే సరిపోతుంది కదా. రెండేళ్ల నుంచి ఒకటే రచ్చ లేపుతున్నారు. రాజశేఖర్ తాను లేపాలనుకున్న పాయింట్స్ కి అది సరైన వేదిక కాదు. వాళ్ళ ఇన్సైడ్ మీటింగ్లో చెప్తే సరిపోయేది. డైరీ ఆవిష్కరణ వేదికపై ఆ ఆవేశానికి అర్థం లేదు.