రజనీకి తగిలిన కాసినో సెగ

ఒక్క ఫొటో, ఒకే ఒక్క ఫొటో రజనీకాంత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న సూపర్ స్టార్.. తన హెల్త్ చెకప్ తో పాటు అగ్రరాజ్యంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఓ క్యాసినోను కూడా సందర్శించాడు. అక్కడ రజనీకాంత్ క్యాసినో ఆడాడో లేదో తెలీదు కానీ, అక్కడ కూర్చున్న ఫొటో మాత్రం ఒకటి అతడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
ఇప్పుడు మీరు చూస్తున్న స్టిల్ ఆ క్యాసినో లోనిదే. ఈ ఫొటో తమిళనాట ట్రెండ్ అవుతోంది. పాజిటివ్ గా మాత్రం కాదు. ఓవైపు తమిళ సినీపరిశ్రమ జీఎస్టీతో పాటు చాలా సమస్యలతో సతమతమవుతుంటే.. తళైవ మాత్రం అమెరికా క్యాసినోలో గడుపుతున్నాడంటూ అతడి వ్యతిరేకులు ప్రచారం అందుకున్నారు.
సినీపరిశ్రమ సమస్యల వరకే ఈ ఫొటోను పరిమితం చేయలేదు. రజనీకాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారు కదా.. అందుకే కొన్ని పార్టీల వాళ్లు కూడా ఈ ఫొటోని వాడేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని చూపుతూ, మరోవైపు రజనీకాంత్ క్యాసినోలో ఉన్న ఫోటోను చూపిస్తూ ఇతడా మన రాష్ట్రాన్ని బాగుచేసేదంటూ విమర్శలు చేస్తున్నారు.
తమిళనాట ఏ చిన్న దుమారం రేగినా, చిన్న అకేషన్ జరిగినా ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు ప్రత్యక్షమైపోతాయి. ఇప్పుడీ వివాదంపై కూడా చాలా చోట్ల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ నాయకుడు మనకొద్దంటూ అప్పుడే ప్రచారం షురూ అయిపోయింది. విషయం గమనించిన రజనీకాంత్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. తమిళ సినీపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవాలంటూ ఓ ట్వీట్ చేశాడు. ఈ ఒక్క ట్వీట్ తో అతడిపై చెలరేగుతున్న విమర్శలు ఆగిపోతాయని రజనీకాంత్ భావిస్తున్నాడా..?
- Log in to post comments