భార‌తీయ సినిమా గ‌ర్వ‌ప‌డే చిత్రమిది: ర‌జ‌నీ

Rajinikanth says 2.0 will be pride of Indian cinema
Tuesday, November 27, 2018 - 10:30

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్‌ వండర్‌ "2.0."  ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు ఈ త్ర‌యం.

ఈ సినిమా భార‌తీయ చిత్రరంగం గ‌ర్వ‌ప‌డే విధంగా రూపొందింద‌ని ర‌జ‌నీకాంత్ అన్నారు.

"రోబో విడుదలై ఎనిమిదేళ్లు అవుతుంది. ఆ సినిమా ఆడియో సమయంలో శంకర్‌గారు నాకు తెలుగు తెలియదని చెప్పి ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇప్పుడు ఆయన చాలా చక్కగా తెలుగులో మాట్లాడటం నేర్చుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలుగు జనాలు చాలా మంచివాళ్లు. వాళ్లని అందరూ ఇష్టపడతారు", ఇలా తెలుగువారిని పొగిడేశాడు ర‌జ‌నీకాంత్‌.

ఇక సినిమా గురించి చెపుతూ.. ఈ మూవీకి ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్ అక్క‌ర్లేద‌న్నాడు. ఇప్ప‌టికే భారీగా అంచ‌నాలున్నాయి క‌దా అని అంటున్నాడు ర‌జ‌నీ. 

"ఈ సినిమా విషయానికి వస్తే టెక్నాలజీ, త్రీడీకి కరెక్ట్‌ అయిన సబ్జెక్ట్‌ కాంబినేషన్‌ కుదిరింది. 100శాతం సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందనే నమ్మకం నాకుంది. శంకర్‌గారు అడిగినవన్నీ సమకూర్చిన నిర్మాత సుభాష్‌కరణ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమాకు ప్రమోషనే అక్కర్లేదు. ప్రసాద్‌గారు ఊరికే డబ్బు వేస్ట్‌ చేస్తున్నారు. ఆల్‌ రెడీ సినిమాపై అంచనాలు ఎక్కడో ఉన్నాయి. సినిమా ఎప్పుడొస్తుందా? అని అందరూ వెయిట్‌ చేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత.. చూసినవాళ్లే సినిమాను ప్రమోట్‌ చేస్తారని నేను చెన్నైలోనే చెప్పాను. 1975లో నేను నటించిన తొలి చిత్రం అపూర్వరాగంగల్‌ సినిమాను చూడాలని ఎంత ఉబలాటపడ్డానో.. 43ఏళ్ల తర్వాత 2.0 కోసం అంతే అతృతగా ఉంది. ఇందులో 45 శాతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. ఇప్పుడు మేకింగ్‌, ట్రైలర్‌లో, సాంగ్స్‌లో చూసినవన్నీ శాంపిల్సే. ఇది ట్రైలర్‌ మాత్రమే. మీరు ఆశ్చర్యపోయేలా గ్రాఫిక్స్‌, బ్రహ్మాండం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. '2.0' మన ఇండియ‌న్ ఇండస్ట్రీ గర్వ పడే చిత్రం. శంకర్‌గారు చెప్పినట్లు ఈ సినిమాను త్రీడీలో చూస్తే ఆ ఎఫెక్టే మరోలా ఉంటుంది. నేను కూడా 29 కోసం వెయిట్‌ చేస్తున్నాను'' అన్నారు ర‌జ‌నీకాంత్‌.

బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్  ఈసినిమాలో విల‌న్‌గా న‌టించాడు. ర‌జ‌నీ సినిమాలో నెగిటివ్ పాత్ర చేయ‌డం ఒక గౌర‌వం అంటున్నాడు అక్ష‌య్‌. - ''2.0' నాకు సినిమా కాదు. ఓ స్కూల్‌కు వెళ్తున్నట్లుగా భావించాను. మా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శంకర్‌గారు. నేను సినిమా ఇండస్ట్రీలో 28 సంవత్సరాలుగా ఉన్నాను. ఇన్నేళ్లలో నేర్చుకోలేని చాలా విషయాలను ఈ సినిమాలో నేర్చుకున్నాను. ఇలాంటి సినిమాలో బిగ్గెస్ట్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌గారితో కలిసి పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన శంకర్‌గారికి థాంక్స్‌. ఓ సింపుల్‌ లైన్‌ ఇస్తే దాని నుండి మేజిక్‌ చేయడం రజనీకాంత్‌గారికే తెలుసు. ఈ సినిమాలో విలన్‌గా నటించాలని అనగానే ఆయనతో దెబ్బలు తినడాన్ని ఓ గౌరవంగా భావించాను. ఈ సినిమాలో ఆయనతో దెబ్బలు తినడమే నాకు బెస్ట్‌ మూమెంట్స్‌. నేను ఈ ప్రాసెస్‌ను ఎంజాయ్‌ చేశాను. నేను కూడా సినిమాను చూడలేదు. విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను."