లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కి రజనీకాంత్ దూరం

Rajinikanth's party not to contest Loksabha polls
Sunday, February 17, 2019 - 10:45

అనుకున్న‌దే జ‌రిగింది. సినిమా హీరోలు ఆవేశంగా పార్టీల‌ను ప్ర‌క‌టిస్తారు.. స్పీచ్‌లు ఇస్తారు. తీరా ఎన్నిక‌ల టైమ్ వ‌చ్చేస‌రికి మేమింకా రెడీ కాలేదంటూ ఫీచ్ మూడ్ చెపుతారు. మొన్న క‌మ‌ల్‌హాస‌న్‌. ఇపుడు ర‌జ‌నీకాంత్‌. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కి దూరంగా ఉంటామ‌ని మొన్న క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌క‌టించారు. విమ‌ర్శ‌లు రాగానే ఆ డెసిష‌న్‌పై వెన‌క్కి త‌గ్గారు. ఇంత‌కీ పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా ప‌క్కాగా తేల‌లేదు.

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మాత్రం..ప‌క్కాగా చెప్పేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కి త‌మ పార్టీ పోటీచేయ‌ద‌ని తేల్చేశారు. విచిత్రం ఏమిటంటే..ర‌జ‌నీకాంత్ పార్టీ పెడుతాన‌ని 14 నెల‌ల క్రితం ప్ర‌క‌టించారు కానీ పార్టీ పేరుని అనౌన్స్ చేయ‌లేదు ఇప్ప‌టి వ‌ర‌కు. రజనీ మక్కల్ మండ్రం పేరుతో ప్ర‌స్తుతానికి కొన్ని కార్య‌క‌లాపాలు చేస్తున్నారు. ఇది పార్టీ కాదు. 

తాజాగా ఈ మండ్రం నిర్ణ‌యం తీసుకొంది.  లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కి దూరంగా ఉండాల‌నేది ఆ నిర్ణ‌యం.

మా టార్గేట్ 2021లో జరిగే తమిళ అసెంబ్లీ ఎన్నికలే. లోక్‌స‌భ‌ ఎన్నికల్లో మేము పోటీ చేయం, ఎవరికీ మద్దత్తు ఇవ్వం. లోకసభ ఎన్నికలలో ఎవరైనా తమ పోటోగానీ, ఎవరికైనా మద్దత్తు అంటూ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తమిళనాట ప్రధానమైన నీటి సమస్యను తీరుస్తారనే నమ్మకం ఉన్నవారికి ఓటు వేయండి, అని  రజనీకాంత్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు.

ర‌జ‌నీకాంత్ మోదీ తొత్తు అని, బీజేపీకి అనుకూలంగా త‌న పార్టీని పెడుతున్నార‌ని త‌మిళ‌నాడులో ఒక అభిప్రాయం ఉంది. త‌మిళ‌నాట మోదీపై చాలా వ్య‌తిరేక‌త ఉంది. ఆ వ్య‌తిరేక‌త‌ని ర‌జ‌నీకాంత్‌పై చూపిస్తున్నారు అక్క‌డి త‌మిళ ప్ర‌జలు. అందుకే ఒక‌పుడు ర‌జ‌నీకాంత్ సినిమా విడుద‌లైతే ఉండే మేనియా ఇపుడు క‌నిపించ‌డం లేదు. క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి కానీ రికార్డులు రావ‌డం లేదు. కొన్న‌వారికి లాభాలు మిగ‌ల‌డం లేదు.