చరణ్ మనసు మార్చుకున్నాడా?

Ram Charan is also following other stars
Friday, April 10, 2020 - 11:45

ఓ పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని క్యాష్ చేసుకోవాలని చూడడం సహజం. ఏ హీరో అయినా ఇలానే ఆలోచిస్తాడు. అందులో తప్పులేదు. ఇప్పుడు చరణ్ కూడా అలానే ఆలోచిస్తున్నాడు. రాజమౌళితో చేస్తున్న ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత, వేరెవరో నిర్మాతకు ఛాన్స్ ఇచ్చేకంటే, తన బ్యానర్ పైనే సినిమా చేస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాడు.

ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" లో మరో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ అదే పనిచేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత హారిక-హాసిని బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి తన అన్న కల్యాణ్ రామ్ ను (ఎన్టీఆర్ ఆర్ట్స్) సహనిర్మాతగా పెట్టాడు.

"ఆర్ఆర్ఆర్ " లాంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత కేవలం రెమ్యూనరేషన్ తీసుకొని మరో సినిమా చేయడం కంటే ఇలా సహ-నిర్మాతగా ఉండడం కరెక్ట్ కదా. ఇప్పుడు ఇదే కోణంలో రామ్ చరణ్ కూడా ఆలోచిస్తున్నట్టు మెగా కాంపౌండ్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే తను స్థాపించిన కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తను హీరోగా సినిమా చేయనని, తండ్రి చిరంజీవితో సినిమాలు నిర్మిస్తానని, అవసరమైతే మిగతా మెగా హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తానని చరణ్ ఆమధ్య చెప్పుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఒట్టు తీసి గట్టున పెడతాడేమో చూడాలి.