రామ్‌చ‌ర‌ణ్‌... రామ్ కాలేడా?

Ram Charan not to essay Ram?
Thursday, July 11, 2019 - 23:45

రామ్ చరణ్ పేరులోనే రామనామం ఉంది. ఆయన డాడీ వీరాంజనేయ భక్తుడు. అందుకే కొడుక్కి రాముడి పేరు పెట్టుకున్నాడు మెగాస్టార్. మరి రామ్ చ‌ర‌ణ్‌ వెండితెరపై రాముడి పాత్ర పోషిస్తే పేరు సార్థకమవుతుంది కదా. గతంలో చరణ్ కి ఇలాంటి ఆఫర్ ఒకటి వచ్చింది. ఐతే ఇపుడు ఆ ఆలోచనే డ్రాపయిందట.

అల్లు అరవింద్ పాత ప్రాజెక్ట్ కి బూజు దులుపు కొత్తగా రామాయణం తీస్తున్నట్లు ప్రకటించారు ఇటీవల. 1500 కోట్లతో అన్ని భాషల్లో తీస్తున్నారట. దర్శకులుగా ఇద్దరు పేర్లను అనౌన్స్ చేశారు. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు వంటివి చెప్పలేదు. బాహుబలి 2 విడుదలైన తర్వాత అల్లు అరవింద్ హడావుడిగా ప్రకటించిన ప్రాజెక్ట్ ఇది. అప్పట్లో రాముడి పాత్రకి రామ్ చరణ్ పేరు బాగా వినిపించింది. మరి ఇపుడు అల్లు అరవింద్, ఆయన కో-నిర్మాతలు ఆ ఊసే ఎత్తడం లేదు. ఎందుకు?

బహుశా చరణ్ కి అంత ఆసక్తి లేనట్లుంది. రాజమౌళి రామాయణం తీస్తానంటే ఎగిరి గంతేసి మళ్లీ డేట్స్ ఇచ్చేవాడు చెర్రీ. కానీ నితీష్ తివారి, రవి ఉడ్యాయర్లు తీసే రామాయణంలో నటించడం అంటే రిస్క్ తీసుకోవడం. బాగా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. పూర్తిగా చాన్స్ తీసుకోవడమే అవుతంది. అందుకే అల్లు అరవింద్ ఈ సారి అల్లుడిని అప్రోచ్ కాలేదు కాబోలు.

రాముడు, సీత, ఆంజనేయుడు, రావణుడు... ఇలా ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింటే.