జీవితమంతా రెస్ట్‌లెస్ రాణి!

Ram Gopal Varma reveals unknown facts about Sridevi's real life
Wednesday, February 28, 2018 - 00:30

శ్రీదేవి జీవితాన్ని ద‌గ్గ‌రిగా చూసిన వారిలో డైర‌క్ట‌ర్‌ రాంగోపాల్ వ‌ర్మ ఒక‌రు. శ్రీదేవి అంటే ఆయ‌న‌కి పిచ్చి అభిమానం. ఐతే ఆమె చివ‌రిగా ఇలా త‌నువు చాలించ‌డం వ‌ర్మ‌ని బాధించింది. ఆమె జీవితంలోని కొన్ని చీక‌టి అంశాలు అంద‌రికీ తెలియాల‌నే ఉద్దేశంతో ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన కొన్ని విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. అతిలోక సుంద‌రిగా పేరొందిన శ్రీదేవి జీవితం అంత అంద‌మైన‌ది కాదు. ఆమె జీవితాంతం రెస్ట్‌లెస్‌గానే బ‌తికిన‌ట్లు వ‌ర్మ రాసిందాన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. 

శ్రీదేవి గురించి వ‌ర్మ‌ వెల్ల‌డించిన విష‌యాలు ఆయ‌న మాటల్లోనే చ‌ద‌వండి....

ఆమె మ‌ర‌ణించిన త‌ర్వాత అంద‌రూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ సంతాపం తెలుపుతున్నారు. విషాదం ఏమిటంటే ఆమె బ‌తికి ఉన్నాన్న‌ళ్లూ ఎపుడూ ప్ర‌శాంతంగా లేదు. రెస్ట్ లేని జీవితం ఆమెది. సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త జీవితానికి, వారి గురించి జ‌నం అల్లుకునే అంద‌మైన ఊహ‌ల‌కి ఎక్క‌డా పొంత‌న ఉండ‌ద‌ని చెప్ప‌డానికి శ్రీదేవి జీవితాన్ని మించిన చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ మ‌రోటి క‌నిపించ‌దు. ఆమెతో నేను క్ష‌ణ‌క్ష‌ణం, గోవిందా గోవిందా సినిమాలు తీశా. ఆమెని చాలా ద‌గ్గ‌రిగా చూశా. 

చాలా మందికి ఆమె జీవితం ప‌ర్‌ఫెక్ట్‌గా గ‌డిచింది అనిపిస్తుంది. అంద‌మైన ముఖార‌విందం, గొప్ప న‌ట‌నాప్ర‌తిభ, ఇద్దరు అందమైన కూతుళ్లతో చ‌క్క‌గా సాగుతున్న‌ట్లు క‌నిపించిన సంసారం..బ‌య‌టి నుంచి చూస్తే ఎవ‌రికైనా  అసూయ క‌లుగుతుంది. ఇంత‌క‌న్నా ఏమి కావాలి అనిపిస్తుంది. మ‌రి శ్రీదేవి నిజంగా హ్య‌పీగా ఉందా? ఆనంద‌మ‌య‌మైన జీవితాన్ని గ‌డిపిందా?

శ్రీదేవిని నేను మొద‌టి సారి క‌లిసిన‌ప్ప‌టి నుంచి ఆమె వ్య‌క్తిగ‌త జీవితం క్షుణ్ణంగా తెలుసు. తండ్రి ఉన్నంతకాలం ఆకాశంలోపక్షిలా హాయిగా, స్వేచ్ఛ‌గా విహంగం చేసింది. తండ్రి మ‌ర‌ణానంత‌రం పంజ‌రంలో చిలుక‌లా మారింది. శ్రీదేవి త‌ల్లి ఆదుర్దా, అతి ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌తో ఆమె రెక్క‌లు విరిగాయి. బందీగా మారింది.

అప్ప‌ట్లో న‌టీన‌టుల‌కి పారితోషికం అంతా బ్లాక్ మ‌నీగా వ‌చ్చేది. ఆ డ‌బ్బుని ఎలా దాచిపెట్టాలో తెలియ‌క ఆమె తండ్రి త‌న బంధువుల‌ని న‌మ్మి వారి ద‌గ్గ‌ర దాచిపెట్టాడు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం బంధువులు ఆ డ‌బ్బును కాజేశారు. ఆమె త‌ల్లికి అంత జ్ఞానం లేదు. ఆమె వ‌చ్చిన డ‌బ్బున‌ల్లా స్థిరాస్తుల‌లో పెట్టుబ‌డులు పెట్టారు. ఆమె కొన్న స్థిరాస్తుల‌న్నీ లీగ‌ల్ స‌మ‌స్య‌లున్న‌వే. దాంతో త‌న‌ జీవితంలోకి బోనీ క‌పూర్ వ‌చ్చే స‌మ‌యానికి శ్రీదేవి చేతిలో పైసా లేని ప‌రిస్థితి. దానికి తోడు బోనీక‌పూర్‌కి అప్ప‌టికే తీవ్ర అప్పులు. ఓదార్పుగా  త‌న భుజం మీద వాలేందుకు శ్రీదేవికి చోటు ఇవ్వడానికి మించి  మ‌రేమీ ఇచ్చేంత‌ సీన్ లేదు ఆయ‌న‌క‌పుడు. అదే స‌మ‌యంలో ఆమె త‌ల్లికి అమెరికాలో స‌ర్జ‌రీ అయింది. బ్ర‌యిన్ స‌ర్జ‌రీ విక‌టించి ఆమె మతి స్థిమితం త‌ప్పింది. ఈ క‌ష్టాల‌కి తోడు ఆమె చిన్న చెల్లెలు శ్రీలేత ప‌క్కింటి కుర్రాడితో పారిపోయి పెళ్లి చేసుకొంది. ఆమె త‌ల్లి ఆస్తుల‌న్నింటిని శ్రీదేవి పేరునే రాసింది కానీ శ్రీల‌త పేచీ పెట్టింది. మాన‌సిక స్థితి స‌రిగా లేని త‌న త‌ల్లి సైన్ చేసిన అగ్రిమెంట్‌లు చెల్ల‌వంది. దాంతో శ్రీదేవికి బోనీ త‌ప్ప కాణి పైసా రాలేదు. 

బోనీ క‌పూర్‌ని చేసుకున్న త‌ర్వాత ఆమెకి ద‌క్కిన ఫ‌లం ఏంటి? ఒక రోజు స్టార్ హోట‌ల్ లాబీలో, అంద‌రూ చూస్తుండ‌గానే శ్రీదేవిని క‌డుపులో త‌న్నింది బోనీక‌పూర్ త‌ల్లి. బోనీ క‌పూర్, ఆయ‌న‌ మొద‌టి భార్య మోనా కాపురంలో చిచ్చు పెట్టింది త‌నే అనే ఆరోప‌ణ‌ని ఎదుర్కొంది. బోనీని పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమె కొంత ఆశ‌ల ప‌ల్ల‌కీలో ఊగిన స‌మయం ఏదైనా ఉందంటే అది ఇంగ్లీషు వింగ్లీషు టైమ్‌లోనే. 

అనిశ్చితి, ఎన్నో మ‌లుపులు, ఎత్తుప‌ల్లాలు ఆమె సున్నిత‌మైన మ‌నోఫ‌ల‌కంపై మాన‌ని గాయాలుగా మిగిలాయి. ఇక ఎపుడూ ఆమె సుఖంగా లేదు.

చాలా చిన్న‌పుడే న‌టిగా మార‌డం, చిన్న వ‌య‌సులోనే ఎన్నింటినో చూడ‌డంతో ఆమె ఎపుడూ సాధార‌ణ యువ‌తుల్లా జీవితాన్ని అనుభ‌వించ‌లేదు. ఎపుడూ మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతూనే వ‌చ్చింది. పేరు, ప్ర‌ఖ్యాతులు, ఫేమ్‌..అన్నీ చిన్న వ‌య‌సులోనే వ‌చ్చాయి. దాంతో ఆమె ఎపుడూ స్వ‌తంత్రంగా, సాధార‌ణంగా ఎద‌గ‌లేక‌పోయింది. త‌ను నిజంగా ఏమి కావాల‌నుకుందో, ఏమి కోరుకుందో తెలిసే అవ‌కాశం ద‌క్క‌లేదు. ఇత‌ర పాత్ర‌ల్లా క‌నిపించేందుకు మేక‌ప్ వేసుకొంది. ముఖంపైనే కాదు త‌న ఆలోచ‌న‌ల‌కి, వ్య‌క్తిత్వానికి కూడా మేక‌ప్ వేసుకొంది. నిజ‌మైన శ్రీదేవి ఎపుడూ ఒక మాస్క్ వెనుకే దాగి ఉండేది. త‌న ఇన్‌సెక్యురిటీస్ వేరే ఎవ‌రికి తెలియ‌కూడ‌ద‌నే తాప‌త్ర‌యంతోనే ఆమె జీవితం గ‌డిచింది.

ప్ర‌పంచం దృష్టిలో ఆమె అతిలోక సుంద‌రి. మ‌రి ఆమె త‌న‌ని తాను అందంగానే ఊహించుకుందా? అని అడిగితే అవుననే స‌మాధానం ఇవ్వాలి. కానీ హీరోయిన్ల‌కి శాపం ఏంటో తెలుసా.. వ‌య‌సు పెరుగుతుండ‌డం. అందంగా కనిపించేందుకు చాలా ఏళ్ల కింద‌టి నుంచే స‌ర్జ‌రీ చేయించుకోవ‌డం మొద‌లుపెట్టింది. వాటి ప్ర‌భావం ఏంటో చూశాం.

బ‌తికినంత కాలం త‌న త‌ల్లితండ్రులు, త‌న భ‌ర్త‌, కొంత మేర‌కు త‌న కూతుళ్లు..వారి భావాల‌కి త‌గ్గ‌ట్లే న‌డిచింది. ఇత‌ర హీరో, హీరోయిన్ల వార‌సుల్లా త‌న కూతుళ్ల‌ను జ‌నం ఆద‌రిస్తారా అన్న భ‌యం కూడా ఆమెని వెంటాడేది. 

ఎదిగిన మ‌గువ శరీరంలో దాగిన‌ ఓ చిన్న పిల్ల..శ్రీదేవి.

అన్నీ భ‌య‌లే. అన్నీ అనుమానాలే. ఆందోళ‌న‌, అనుమానం..ఆమెని ఎపుడూ ప్ర‌శాంతంగా నిలువ‌నివ్వ‌లేదు. రెస్ట్‌లెస్‌గా బ‌తికింది.

చ‌నిపోయిన వారికి రెస్ట్ ఇన్ పీస్ అనే సంతాపాలు చెప్పే మెసెజీలు పెట్ట‌డం నాకు అంత‌గా న‌చ్చ‌దు. కానీ శ్రీదేవి విష‌యంలో మాత్రం రెస్ట్ ఇన్ పీస్ అని త‌ప్పకుండా చెపుతా. బాధ‌లేవీ క‌ల‌వ‌ర‌పెట్టనంత‌ దూరంగా అంద‌నంత‌గా వెళ్లిందిపుడు ఆమె. రెస్ట్ ఇన్ పీస్ శ్రీదేవి. కానీ ప్ర‌పంచం మాత్రం నీ మ‌ర‌ణంతో ప్ర‌శాంతంగా ఉండ‌దు. 

ఇపుడు నేను ఊహించుకుంటున్నా.. నువ్వు స్వ‌ర్గం అంతా స్వేచ్చావిహంగం చేస్తున్న‌ట్లు ...ఆనందంగా..శాంతంగా...