రాజా ది గ్రేట్ రిజ‌ల్ట్‌ కోసం రామ్ ఆస‌క్తి

Ram wants to know the result of Ravi Teja's Raja The Great
Tuesday, October 17, 2017 - 18:30

ర‌వితేజ న‌టించిన "రాజా ది గ్రేట్" సినిమా రేపు (అక్టోబ‌ర్ 18) విడుద‌ల అవుతోంది. ఈ సినిమా ఆడితేనే ర‌వితేజ ల‌క్ మారుతుంది. కొంత‌కాలంగా హిట్‌లు లేని మాస్ మ‌హారాజాకిది లిట్మ‌స్ టెస్ట్‌. దీని ఫ‌లితం కోసం ఆయ‌న ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నాడు. అయితే ర‌విత‌జ క‌న్నా మ‌రో హీరో రామ్ మ‌రింత ఆస‌క్తిగా రాజా ది గ్రేట్ ఫ‌లితం కోసం ఎదురు చూస్తున్నాడు.

ర‌వితేజ సినిమా బాక్సాఫీస్ రిజ‌ల్ట్‌కి, హీరో రామ్‌కి లింక్ ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? మేట‌ర్ ఏంటంటే...

"రాజా ది గ్రేట్" సినిమా క‌థ‌ని మొద‌ట రామ్‌కి వినిపించాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. క‌థ విని ఎంతో ఎగ్జ‌యిట్ అయిన రామ్.. రాత్రికి రాత్రే ట్విట్ట‌ర్‌లో ఈ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌కటించాడు. బ్ల‌యిండ్ ప‌ర్స‌న్‌గా న‌టించ‌నుండ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని సంబ‌రంగా రాసుకున్నాడు ట్విట్ట‌ర్‌లో.

కొద్ది రోజుల‌కే సీన్ మారింది. సినిమా చేయ‌న‌ని త‌ప్పుకున్నాడు రామ్‌. ఎందుకు? రామ్ కోరినంత పారితోషికం ఇచ్చేందుకు దిల్‌రాజు ఇవ్వ‌లేద‌ని గిట్ట‌ని వారు ప్ర‌చారం చేశారు. రామ్ సెకండాఫ్‌లో కొన్ని మార్పులు కోరాడ‌ని, అది వ‌ర్క‌వుట్ కాలేద‌ని మ‌రింత‌గా గిట్టని వారు రీజ‌న్ ఇచ్చారు. అదంతా వేరే మేట‌ర్‌. ఏతావాతా, రామ్ త‌ప్పుకున్నాడు...ర‌వితేజ ఒప్పుకున్నాడు. అలా మ‌న ముందుకొచ్చింది "రాజా ది గ్రేట్".

మ‌రి ఈ సినిమా ఆడితే..ర‌వితేజ‌కి పంట పండిన‌ట్లే, అంతేకాదు రామ్‌కి డిస్‌ప్పాయింట్‌మెంట్ త‌ప్పుదు. ఫ‌లితం తేడాగా ఉంటే రామ్ తాను త‌ప్పుకున్నందుకు న‌ష్టం ఏమీ జ‌ర‌గ‌లేద‌ని స్థిమిత‌ప‌డొచ్చు. సో.. ర‌వితేజ‌తో పాటు రామ్ కూడా "రాజా ది గ్రేట్" రిజ‌ల్ట్ కోసం ఈగ‌ర్‌గా ఎదురుచూస్తున్నాడు.