కొత్త ఫ్యూచర్ కి రెడీ కావాలి!

Rana talks about lockdown period and future
Sunday, May 10, 2020 - 18:15

కరోనా రాక ముందు ఉన్న ప్రపంచం వేరు, కరోనా తర్వాతి వల్డ్ వేరు. ఈ మాట అంటున్నది రానా దగ్గుబాటి. సీఎం జగన్, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ అన్నట్లు మనమంతా కరోనాతో ఇక సహజీవనం చెయ్యాల్సిందే. ఈ వ్యాధి తగ్గుముఖం పట్టినా, పట్టకపోయినా మన అలవాట్లు, మన వ్యవహారాలు, పని తీరు అన్ని మార్చుకోవాల్సిందే అని అంటున్నాడు రానా.

"ఒక విధంగా చెప్పాలంటే... ఈ లాక్డౌన్ మంచిదే. ఉరుకుల పరుగుల జీవితానికి అప్పుడప్పుడు బ్రేకులు పడాలి. పని చెయ్యకపోతే పూట గడవని పేదవారి గురించి బాధ ఉంది కానీ... మిగతా వారికి ఇలాంటి లాక్దౌన్ లు అవసరమే. ఆత్మావలోకనం చేసుకునేందుకు పనికొస్తుంది ఇది," అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రానా.

మరి ఈ టైంలో రానా ఏమి చేస్తున్నట్లు? "నా జీవితంలో పెద్దగా మార్పు ఏమి లేదు. నేను షూటింగ్ లేని సమయాల్లో ఏమి చేస్తానో అదే చేస్తున్నాను. పుస్తకాలు చదువుతున్నా. మా నాన్నతో కలిసి సినిమాలు చూస్తున్నా... నాకు ప్రత్యేకంగా కొన్ని వ్యాపారాలు, వ్యాపకాలున్నాయి. సో డైలీ లైఫ్ పెద్దగా మారలేదు," అని సెలవిచ్చాడు రానా.