రష్మిక కాల్షీట్ వేస్ట్

Rashmika appears before IT officials
Tuesday, January 21, 2020 - 23:30

షూటింగ్స్, సిట్టింగ్స్ అన్నీ కాన్సిల్ చేసుకుంది రష్మిక. ఎందుకంటే, ఈరోజు (Jan 21) ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు ఆమె హాజరైంది. తల్లిదండ్రులతో కలిసి మైసూర్ లోని ఇన్ కమ్ టాక్స్ ఆఫీస్ కు వెళ్లిన రష్మిక, తన ఆదాయానికి సంబంధించిన వివరాల్ని అధికారులకు అందించింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. దాదాపు గంటన్నర పాటు రష్మికను ప్రశ్నించిన ఐటీ అధికారులు ఆమె చెప్పిన వివరాలన్నింటినీ రికార్డు చేశారు.

కొన్ని రోజుల కిందట కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్ లో రష్మిక ఇల్లు, ఆమె తండ్రికి చెందిన ఆఫీసులపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో రష్మిక ఇంటి నుంచి లెక్క తేల్చని 25 లక్షల రూపాయల క్యాష్ తో పాటు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల విలువ దాదాపు 3 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

లెక్కలన్నీ తేలిన తర్వాత కోటిన్నరకు రష్మిక పన్ను చెల్లించలేదని తేలింది. మరోవైపు జరిగిన ఘటనపై రష్మిక తరఫు వ్యక్తులు స్పందించారు. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తితో పాటు డాక్యుమెంట్లన్నీ రష్మిక తండ్రికి సంబంధించినవని.. రష్మికకు వీటితో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. కేవలం ఆస్తులపై ఐటీ అధికారులతో మాట్లాడేందుకు మాత్రమే రష్మిక వెళ్లిందని అంటున్నారు.

అటు రష్మిక ఈ విషయాన్ని వీలైనంత స్మూత్ గా పరిష్కరించుకోవాలని చూస్తోంది. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా.. పన్ను బకాయిలన్నీ చెల్లించి క్లీన్ గా బయటపడాలని ఆమె అనుకుంటోంది. ప్రస్తుతం ఆమె భారీ సినిమాలతో బిజీగా ఉంది.