టాలీవుడ్ లో ఇక మిగిలింది వీళ్లే

The remaining bachelors of Tollywood
Wednesday, May 13, 2020 - 18:45

మొన్నటివరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో రానా ముందు వరుసలో ఉండేవాడు. అలాంటి వ్యక్తి సడెన్ గా తన ప్రేమ వ్యవహారం బయటపెట్టాడు. డిసెంబర్ లో ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడు. రానా కంటే ముందే నిఖిల్, నితిన్ పెళ్లికి రెడీ అయిపోయారు. నిఖిల్ రేపే పెళ్లి చేసుకోబోతున్నాడు. లాక్ డౌన్ వల్ల ఆల్రెడీ ఒకసారి పెళ్లిని వాయిదా వేసుకున్న నితిన్ కూడా  రేపోమాపో అన్నట్టున్నాడు.

తాజాగా ఈ లిస్ట్ లోకి వరుణ్ తేజ్ కూడా చేరాడు. వచ్చే ఏడాది చివరి నాటికి వరుణ్ కు పెళ్లి చేసేస్తానని స్వయంగా నాగబాబు ప్రకటించాడు. కుదరకపోతే 2022లో గ్యారెంటీగా పెళ్లి చేసేస్తానని ఘంటాపథంగా చెప్పేశాడు. సో.. టాలీవుడ్ హీరోలంతా ఒక్కొక్కరుగా వడివడిగా బ్యాచిలర్ లైఫ్ కు బై చెప్పేస్తున్నారు. ఇక మిగిలింది అతికొద్ది మంది మాత్రమే.

వీళ్లలో ముందువరుసలో ఉన్న హీరో ప్రభాస్. 40 ఏళ్లొచ్చినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడి పెళ్లిపై కృష్ణంరాజు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నా ప్రభావం మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే ఈసారి పరిస్థితులు మారాయి. మిగతా హీరోల్లానే ప్రభాస్ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది ప్రభాస్ కచ్చితంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.

ప్రభాస్ తర్వాత ఈ లిస్ట్ లో శర్వానంద్, సాయిధరమ్ తేజ్, రామ్, రాజ్ తరుణ్, అఖిల్ లాంటి హీరోలున్నారు. మరో రెండేళ్లలో పెళ్లి చేసుకుంటానని శర్వానంద్ ఆమధ్య ప్రకటించాడు. రాజ్ తరుణ్ కూడా 2021లో పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. అఖిల్ ఆల్రెడీ ఓసారి పెళ్లిపీటల వరకు వెళ్లి ఆగాడు. మరికొన్నేళ్లలో అతడు కూడా పెళ్లి చేసుకోవడం ఖాయం. ఇక రామ్, సాయితేజ్ లాంటి హీరోలు రానా టైపులోనే ఏదో ఒక రోజు  ఇలా సడెన్ గా తమ ప్రేమ సంగతులు బయటపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.