అంతులేని నిరీక్షణ.. కొండంత ఆశ

Restless waiting for debut actors and directors
Sunday, May 24, 2020 - 08:00

లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ ఫేస్ చేస్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. హీరోల ప్లానింగ్ మొత్తం గాడితప్పింది. హీరోయిన్ల కాల్షీట్లన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఎంతోమందికి ఆదాయం పడిపోయింది. వీటన్నింటికీ తోడు పైకి కనిపించని మరో మానసిక వేదనను కూడా కొంతమంది అనుభవిస్తున్నారు.

ఫర్ ఎగ్జాంపుల్ ప్రదీప్ నే తీసుకుందాం. ఎట్టకేలకు హీరోగా మారాడు ఈ స్టార్ యాంకర్. అన్నీ అనుకున్నట్టు జరిగితే "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అనే సినిమా ఈపాటికి థియేటర్లలోకి ఉండాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల అలా జరగలేదు. దీంతో ప్రదీప్ పడుతున్న టెన్షన్ అంతా  ఇంతా కాదు. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చి ఉంటే ప్రదీప్ హీరోగా క్లిక్ అయ్యాడా లేదా అనే విషయం ఈపాటికి తేలిపోయి ఉండేది.

మెగా కాంపౌండ్ కు చెందిన వైష్ణవ్ తేజ్ పరిస్థితి కూడా ఇలాంటిదే. ఉప్పెనతో హీరోగా మారిన ఈ వైష్ణవ్.. ఆ సినిమా రిజల్ట్ కోసం ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలో అతడికే అర్థంకావడం లేదు. ఇప్పటికే విడుదల 2 నెలలు ఆలస్యమైంది. ఆగస్ట్ వరకు సినిమా థియేటర్లలోకి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో అతడు కూడా తెగ టెన్షన్ పడుతున్నాడు.

ప్రదీప్, వైష్ణవ్ మాత్రమే కాదు... కొంతమంది దర్శకులది కూడా ఇదే పరిస్థితి. మిస్ ఇండియా సినిమాతో నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అటు సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో సుబ్బు, ఉప్పెన మూవీతో బుచ్చిబాబు, శ్రీకారం సినిమాతో కిషోర్ దర్శకులుగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. లాక్ డౌన్ వచ్చి వీళ్లందర్లో టెన్షన్ ను రెట్టింపు చేసింది. లేదంటే ఈపాటికి వీళ్ల జాతకాలు తేలిపోయేవి.