వర్మ వెనక్కి తగ్గినట్టేనా?

RGV changes title of Kamma Rajyamlo
Thursday, November 28, 2019 - 10:30

ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు, ఇప్పుడు వర్మ చేసిన సినిమా మరో ఎత్తు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే ఈ ఒక్క సినిమాతో టోటల్ పొలిటికల్ సిస్టమ్ కుదిపి వదిలేశాడు ఆర్జీవీ. ప్రస్తుత రాజకీయ నాయకులపై అతడు వేసిన సెటైర్లు, పంచ్ లు అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో భారీ ఎత్తున కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు ఈ దర్శకనిర్మాత.

అయితే తనకు కేసులు కొత్తకాదని, కేసు పడకపోతేనే కొత్త అంటూ తనకు తాను గొప్పగా ప్రకటించుకున్న వర్మ, ఇప్పుడు సినిమా టైటిల్ విషయంలో కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. ఇదే టైటిల్ తో సినిమా రిలీజ్ చేస్తామంటే ఇటు కోర్టులు, అటు సెన్సార్ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండడంతో.. ఆఖరి నిమిషంలో వర్మ, తన సినిమా టైటిల్ మార్చాడు.

కమ్మరాజ్యంలో కడపరెడ్లు బదులు .. అమ్మ రాజ్యంలో కడప బిడ్డ‌లు అనే టైటిల్ ను పెట్టబోతున్నాడు వర్మ. ఇలా చేయడం వల్ల తన సినిమాకు లైన్ క్లియర్ అయి విడుదల సాఫీగా సాగుతుందని వర్మ భావిస్తున్నాడు. సినిమా విడుదలకు ఇంకొన్ని గంటలు మాత్రమే టైమ్ ఉండడంతో.. వర్మ చేసిన ఈ టైటిల్ మార్పు, అతడి సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేస్తుందా చేయదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.