నెపోటిజాన్ని వెనకొసుకొచ్చిన వర్మ

RGV defends Nepotism
Wednesday, June 17, 2020 - 13:15

సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్ లో కొంతమందిపై, కొన్ని కుటుంబాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. తమకు నచ్చిన వాళ్లకే అవకాశాలిస్తూ, కొందర్నే ప్రోత్సహిస్తూ బాలీవుడ్ లో ఓ మాఫియా జరుగుతోందంటూ చాలామంది విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వాళ్లందరికీ పూర్తి రివర్స్ లో వెళ్తున్నాడు వర్మ. ఆశ్చర్యకరంగా బాలీవుడ్ ను, కొన్ని కుటుంబాల్ని వెనకేసుకొచ్చాడు.

బాలీవుడ్ లో ఇన్ సైడర్, అవుట్ సైడర్ అనే చర్చ జోరుగా సాగుతోందని.. కానీ ఇన్ సైడర్ ను నిర్ణయించేది ప్రేక్షకులని అన్నాడు వర్మ. బాలీవుడ్ కుటుంబాలపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న కొంతమంది, సుశాంత్ కూడా ఓ 15 ఏళ్ల తర్వాత హీరోగా బాగా స్థిరపడి అతడి కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఇలానే స్పందిస్తారా అని ప్రశ్నించాడు.

సుశాంత్ కు అవకాశాలు రాకుండా అడ్డుపడ్డారంటూ అతడు మరణించిన తర్వాత నానా యాగీ చేస్తున్న కొందరు.. సుశాంత్ చనిపోవడానికి 48 గంటల ముందు ఇవన్నీ బయటపెడితే కనీసం ఓ ప్రాణం కాపాడిన వాళ్లు అయ్యేవారంటూ ట్వీట్ చేశాడు.

ఇలాంటి ఇండస్ట్రీలో మంచి పొజిషన్ కు వచ్చి, హీరోగా గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ అనే చంద్రుడ్ని సుశాంత్ తాకాడని.. చాలామంది ఇంకా భూమిపైనే ఉన్నారని, ఒక్క అవకాశం కూడా లభించలేదని అన్నాడు వర్మ. అలాంటి వాళ్లంతా ఇండస్ట్రీని తిడుతూ ఆత్మహత్యలు చేసుకోవాలా అంటూ ప్రశ్నించాడు. బిగ్ బి, కరణ్ లాంటి వాళ్లు ఒకప్పుడు ఏమీ లేకుండానే పరిశ్రమకు వచ్చారని గుర్తుచేశాడు.