సెన్సార్ తో పెట్టుకుంటే అంతే సంగతులు

RGV facing many hurdles at censor board
Wednesday, December 4, 2019 - 19:45

పాపం వర్మ.. సెన్సార్ తో పెట్టుకుంటే ఏమౌతుందో ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ టైమ్ లో కూడా వర్మకు ఇన్ని కష్టాల్లేవు. ఈసారి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. వర్మ అందరితో ఆడుకుంటే, ఇప్పుడు సెన్సార్ బోర్డ్ అతడితో ఆడుకుంటోంది. ఒకటి కాదు, ఏకంగా రెండు సినిమాల్ని డైలమాలో పడేసింది.

వీటిలో ఒక సినిమా గురించి మనకు తెలిసిందే. అదే కమ్మరాజ్యంలో కడపరెడ్లు అలియాస్ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు. ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ చేతిలోనే ఉంది. కోర్టు ఆదేశాల మేరకు సినిమా చూసిన సెన్సార్ అధికారులు, మూవీకి 90 కట్స్ చెప్పాల్సి వస్తోందని.. కాబట్టి రివ్యూ కమిటీకి వెళ్తే బెటరని చెప్పి చేతులు దులుపుకుంది.

నిజానికి వర్మ కుదురుగా ఉంటే సెన్సార్ బోర్డ్ లోనే పనైపోయేది. అనవసరంగా బోర్డ్ ను కెలికాడు. వాళ్లపై లేనిపోని విమర్శలు చేశాడు. దీంతో నిబంధనల్ని ఎలా వాడుకోవాలో, అలా వాడారు సెన్సార్ అధికారులు. పైగా టైటిల్ మారుస్తానని వర్మ వాలంటరీగా ముందుకొచ్చినా చుక్కలు చూపిస్తున్నారు.

మరోవైపు వర్మకు చెందిన బ్యూటిఫుల్ అనే సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. లెక్కప్రకారం ఈ శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అనుకున్నారు. కానీ సెన్సార్ సభ్యులు మాత్రం సినిమా చూడలేదు, సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో వర్మ అండ్ కో బిజినెస్ ఆపేసింది. సెన్సార్ తర్వాత చూసుకుందామని అందరికీ చెప్పేసింది. సరిగ్గా అదే టైమ్ లో సినిమాకు సెన్సార్ పూర్తిచేశారు సభ్యులు. దీంతో సెన్సార్ అయినా రిలీజ్ చేయలేని పరిస్థితి. ఈ సినిమా కూడా వాయిదాపడింది.