వ‌ర్మ ఉన్న‌దున్న‌ట్లు చూపిస్తున్నాడుగా!

RGV is showing NTR's twilight years in authentic manner?
Friday, March 8, 2019 - 09:45

1995 వైస్రాయ్ ఉదంతం చూసిన వారు, ఆనాటి రాజ‌కీయ పరిణామాల‌ను గ‌మ‌నించిన వారు ఎవ‌రైనా.. వ‌ర్మ తీస్తున్న "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" ట్ర‌యిల‌ర్‌ని ఇష్ట‌ప‌డుతారు. దాదాపుగా ఆనాటి ప‌రిస్థితుల‌ను త‌న సినిమాలో ప్ర‌తిబింబిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. లక్ష్మీపార్వ‌తికి ఎంద‌రితోనూ సంబంధాలున్నాయ‌నీ అప్ప‌ట్లో వినిపించిన పుకార్ల‌ను కూడా ఉన్న‌దున్న‌ట్లుగా డైలాగ్ ద్వారా పెట్టాడు వ‌ర్మ‌. ఈ కొత్త ట్ర‌యిల‌ర్‌లో వినిపించిన డైలాగ్‌లు అన్ని అప్ప‌ట్లో ఆన్ ది రికార్డో, ఆఫ్ ది రికార్డో విన్న‌వే.

మ‌హాన‌టుడు, మ‌హానాయ‌కుడు ఎన్టీఆర్ జీవితం చ‌ర‌మాంకంలో జ‌రిగిన విషాద సంఘ‌ట‌న‌ల స‌మాహారంగా ఈ సినిమాని వ‌ర్మ తెర‌కెక్కించిన‌ట్లు క‌నిపిస్తోంది. త‌న పిల్ల‌లే త‌న‌ని కాద‌నుకోవ‌డం, తాను న‌మ్మిన వారే వెన్నుపోటు పొడ‌వ‌డం, త‌న బ‌యోగ్ర‌ఫీ రాస్తాన‌ని వ‌చ్చిన స్త్రీ త‌న‌కి రెండో భార్య కావ‌డం.. ..ఎన్టీఆర్ జీవితం చివ‌రిద‌శ‌లో ఒక సినిమాకి కావాల్సిన ఎంతో నాట‌కీయ‌త‌, డ్రామా ఉంది. 

వ‌ర్మ నిజంగా హృద్యంగా తీస్తే మంచి సినిమా అవుతుంది. ట్ర‌యిల‌ర్‌లోనే సినిమా చూపించ‌డం, సినిమా థియేట‌ర్‌కి వెళ్లిన త‌ర్వాత అక్క‌డా మ‌ళ్లీ ట్ర‌యిల‌ర్ త‌ప్ప అంత‌కుమించి చూపించ‌క‌పోవ‌డం వ‌ర్మ సినిమాల్లో ఇటీవ‌ల  క‌నిపిస్తున్న పెద్ద లోపం. ఈ సినిమా అలా ఉండ‌ద‌నిపిస్తోంది. నిజంగా వ‌ర్మ నిజాయితీగా తీస్తే ఈ బ‌యోపిక్ ఆడుతుంది. నిజ‌మైన బ‌యోపిక్‌లుగా వ‌చ్చిన "ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు", "ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు" దారుణంగా ప‌రాజ‌యం పాలు అయ్యాయి. మ‌రి అస‌లు క‌థ అంటూ వ‌ర్మ తీస్తున్న "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" అయినా ఆక‌ట్టుకుంటుందా, బాక్సాఫీస్ వద్ద సంచ‌ల‌నం సృష్టిస్తుందా అనేది చూడాలి.