ఆస్కార్ ప‌రిశీల‌న‌కి విలేజ్ రాక్‌స్టార్స్‌

Rima Das's Village Rockstars is India's official contender for Oscars
Saturday, September 22, 2018 - 23:00

అస్సామీ ద‌ర్శ‌కురాలు రీమా దాస్‌తీసిన "విలేజ్ రాక్‌స్టార్స్" అనే చిన్న సినిమా ఈ సారి మ‌న దేశం నుంచి ఆస్కార్ పోటీకి ఎంపికైంది. ఉత్త‌మ ఫారిన్ మూవీ కేట‌గిరీలో ఒక్కోదేశం ఒక సినిమా పంపిస్తుంటుంది. ఈ ఏడాది మ‌న దేశం నుంచి  ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ని పంపిస్తున్నామ‌ని ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎఫ్‌ఐ) శనివారం ప్ర‌క‌టించింది. 

అస్సాంకి చెందిన రీమా దాస్ తీసిన రెండో చిత్రం ఇది. ఈ సినిమాకి ఆమె రైట‌ర్‌, ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌, నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు. క్రెడిట్ అంతా త‌న‌ఖాతాలోనే వేసుకోవాల‌న్న కోరిక‌తో చేయ‌లేదు. క్రూ మొత్తానికి డ‌బ్బులు ఇచ్చే స్తోమ‌త లేక తాను దాచుకున్న డ‌బ్బుతోఈ సినిమాని తీశారు రీమాదాస్‌.అందుకే అన్నిప‌నులు తనే చేసుకున్నారు. 

కేన‌న్ 5డి కెమెరాని కొని..ఆ కెమెరాతో ఈ సినిమాని షూట్ చేశారు. సినిమాలోన‌టించిన వారంత అస్సాంలోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన గ్రామ‌స్థులు. ఒక ప‌దేళ్ల అమ్మాయి మారుమూల గ్రామంలో పుట్టి పెరుగుతుంటుంది. ఆ విలేజ్‌లో రాక్‌బాండ్ ఏర్పాటు చేయాల‌నేది ఆ పిల్ల క‌ల‌. మ‌రి బాండ్ ఏర్పాటు చేయాలంటే క‌నీసం గిటారు అయినా ఉండాలి క‌దా. ఎల‌క్ర్టానికి గిటార్ కోసం, ఆ బాండ్ కోసం ఆ అమ్మాయి చేసిన ప్ర‌య‌త్న‌మే ఈ చిన్న సినిమా క‌థ‌. ఇప్ప‌టికే ఈ సినిమా టొరొంటో ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌శంస‌లు అందుకొంది. జాతీయ ఉత్త‌మ చిత్రంగా ఈ ఏడాది నేష‌న‌ల్ అవార్డును పొందింది. 

స‌త్య‌జిత్ రే తీసిన క్లాసిక్ "ప‌థేర్ పాంచాలి" సినిమా స్ఫూర్తితో ఈ సినిమాని తీశారు రీమాదాసు. ఈ మూవీ బ‌డ్జెట్ 50 ల‌క్ష‌ల లోపే.