దారి చూపించిన ప్రభు

RK Nagar hits OTT
Thursday, April 30, 2020 - 15:30

భార్య జ్యోతిక నటించిన ఓ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయకుండా ఓటీటీకి ఇవ్వాలని భావించాడు సూర్య. దీంతో డిస్ట్రిబ్యూటర్లంతా ఎదురు తిరిగారు. తమ నిరసన వ్యక్తం చేస్తూనే, పరోక్షంగా హెచ్చరికలు కూడా ఇచ్చేంత స్థాయికి వెళ్లారు. అసలు ఏ సినిమానైనా థియేట్రికల్ కు ఇవ్వకుండా ఓటీటీకి ఇవ్వొచ్చా? ఇస్తే ఎదురయ్యే సమస్యలేంటి? లాంటి చర్చ ఓవైపు జరుగుతుండగానే చాప కింద నీరులా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

వెంకట్ ప్రభు నిర్మాతగా శరవణరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్కే నగర్ అనే సినిమాను ఓటీటీకి ఇచ్చేశారు. మన తెలుగు జనాలకు కూడా తెలిసిన వైభవ్ ఇందులో హీరో. ఓవైపు జ్యోతిక సినిమా పొనుమగళ్ వందాల్ ను ఓటీటీకి ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతుండగానే.. వైభవ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. దీంతో సూర్య వర్గానికి ఇప్పుడు మరింత బలం చేకూరినట్టయింది.

జూన్ రెండో వారం వరకు థియేటర్లు, షూటింగ్ లు మొదలయ్యే అవకాశం లేదని నడిగర్ సంఘం పరోక్షంగా చెప్పిన నేపథ్యంలో.. చిన్నాచితకా సినిమాలన్నీ ఓటీటీకి క్యూ కట్టాయి. అటు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ కూడా ఈ దిశగా వేగంగా పావులు కదుపుతున్నాయి. మరో వారం రోజుల్లో మరిన్ని కొత్త తమిళ సినిమాలు ఓటీటీపైకి రాబోతున్నాయి. అప్పుడిక జ్యోతిక సినిమాను అడ్డుకునే వారు ఉండకపోవచ్చు.

ఇటు తెలుగులో మాత్రం ఇలాంటి డిస్కషన్ లేదు. ఎవడి సినిమా వాడిష్టం. నిర్మాతకు నచ్చితే ఓటీటీకి ఇచ్చుకోవడమే. ఒకే ఒక్క కండిషన్ ఏంటంటే.. హీరో ఒప్పుకోవాలి. చిన్న సినిమాలకైతే ఆ సమస్య కూడా లేదు. ఫిలింఛాంబర్ నిబంధనల్ని టాలీవుడ్ లో పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు.