సర్కార్‌కి మొదలైన సెగ!
"మెర్సల్" (అదిరింది) సినిమా అపుడు పెద్ద రాజకీయ దుమారమే రేగింది. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలపై సెటైర్‌లున్నాయని బీజేపీ వాళ్లు నానా రభస సృష్టించారు. అది సినిమాకి హెల్ప్ అయింది. కలెక్షన్లు దుమ్ము రేపాయి. ఇపుడు "సర్కార్" సినిమాకి కూడా రాజకీయ రగడ అంటుకొంది.
"సర్కార్ " తమిళ వెర్సన్‌లోని కొన్ని సీన్లు, పాత్రల పేర్లు రాజకీయంగా ఇపుడు పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నాయి. ఈ సినిమాని నిర్మించింది సన్ టీవీ సంస్థ (ఇది డీఎంకేకి చెందినది). సినిమాలో లేడీ విలన్‌గా నటించిన వరలక్ష్మీ పాత్ర పేరు కోమలివల్లి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు కోమలివల్లి. ఇన్‌డైరక్ట్‌గా అన్నాడీఎంకే పార్టీని విలన్‌గా చూపించారనేది ఆరోపణ. అంతేకాదు, ఈ సినిమాలో ఒక పాటలో మురుగదాస్ (నటించాడు) కోపంగా మిక్సీని మంటల్లో వేస్తాడు. అన్నాడీఎంకే పార్టీ పేదమహిళలకి గ్రైండర్ మిక్సీలను అందించింది గత ఎన్నికల్లో. ఇక సినిమా టైటిల్స్ పడుతున్నపుడు నాటి రాజుల కాలం నుంచి నేటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలను గ్రాఫిక్స్ రూపంలో చూపించారు. ఈ గ్రాఫిక్స్‌లో వీలైన చోటల్లా ఉదయించే సూర్యుడిని చూపించారు. డీఎంకే పార్టీ గుర్తు..ఉదయించే సూర్యుడే.
దాంతో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు సినిమాని అడ్డుకుంటున్నారు. చాలా చోట్ల సినిమా షోలని నిలిపివేశారు. అలాగే కొన్ని చోట్ల ఆ రెండు అభ్యంతరకర సన్నివేశాలను తీసేస్తున్నారు. నిర్మాతలు కూడా ఆ రెండు సీన్లని మ్యూట్ చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు, ఈ రాజకీయ వివాదంతో ఈ సాదాసీదా పొలిటికల్ డ్రామాకి మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ఈ వీకెండ్ తర్వాత పడుకునే అవకాశం ఉన్న సినిమాకి అన్నాడీఎంకే నేతలు అనసరంగా క్రేజ్ తెచ్చారు.
తమిళ హీరో విజయ్‌కి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనే కోరిక ఉంది. చాలా కాలంగా పార్టీ పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. జయలలిత ఉన్నంతకాలం కుక్కిన పేనుల ఉన్న సినిమా తారలంతా ఇపుడు జూలు విదుల్చుతున్నారు. రజనీకాంత్, కమల్, విజయ్..వీరంతా తమిళనాట ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతని క్యాష్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు. ఈ బ్యాచ్‌లో విజయ్‌కి అన్ని రకాలుగా కలిసొస్తోంది. వయసులో ఉండడం, యువతలో క్రేజ్ ఉండడం, తమిళనాడు సాధారణ జనం మూడ్‌కి తగ్గట్లు బీజేపీని, అన్నాడీఎంకేని టార్గెట్ చేయడం అతనికి అడ్వాంటేజ్‌గా మారింది.
- Log in to post comments