లాక్ డౌన్ లో కూడా తగ్గని రాజమౌళి

RRR: NTR promo work is going on
Friday, April 3, 2020 - 18:30

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తోంది. సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే షూట్ లేకపోయినా ఈ సినిమాకు సంబంధించిన మిగతా పనులు మాత్రం ఆగలేదు. దర్శకుడు రాజమౌళి ఈ విషయంలో పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. లాక్ డౌన్ టైమ్ ను కూడా తన సినిమా కోసం వాడుకుంటున్నాడు.

ప్రస్తుతం రాజమౌళి తన ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. తను ఉంటున్న ఆపార్ట్ మెంట్స్ కాంపౌండ్ లోనే ఆర్ఆర్ఆర్ ఎడిటింగ్ కూడా జరుగుతోంది. ఆ పనుల్ని రాజమౌళి పర్యవేక్షిస్తున్నాడు. అంతేకాదు... సినిమాకు సంబంధించి మిగతా యూనిట్ కు కూడా పనులు అప్పగించాడు జక్కన్న. వాటిని కూడా పర్యవేక్షిస్తున్నాడు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ టీమ్ కూడా జోరుగా వర్క్ చేస్తోంది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ సినిమా నుంచి రామ్ చరణ్ లుక్ ను టీజర్ గా విడుదల చేసింది. చరణ్ బర్త్ డే సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు పేరిట ఆ వీడియో వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కు సంబంధించి టీజర్ కట్ పై యూనిట్ వర్క్ చేస్తోంది.
 

దీనికి రామరాజు ఫర్ భీమ్ లేదా అల్లూరి ఫర్ కొమరం అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. చరణ్ టీజర్ బాగా క్లిక్ అయింది. అందులో ఎన్టీఆర్ వాయిస్ కు, చెర్రీ న్యూ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోనివిధంగా తారక్ టీజర్ ను కట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు రాజమౌళి.ఈసారి అన్ని భాషల్లో చరణ్ వాయిస్ వినిపించబోతోందన్నమాట.