తెలుగులో ఇంకా 50 కోట్లు రావాలి!

Saaho needs to recover another 50 Cr in Telugu
Wednesday, September 4, 2019 - 18:45

సాహో ఇప్పటి వరకు కలెక్ట్‌ చేసింది ఒక ఎత్తు. ఇకపై చేయాల్సింది మరో ఎత్తు. మొదటి ఐదు రోజుల్లో ఇంత కలెక్ట్‌ చేసింది అంత కలెక్ట్‌ చేసిందని పోస్టర్ల మీద పోస్టర్లు వదిలారు. పబ్లిసిటీ బ్యాచ్‌ ఊగిపోయారు. ఫైవ్‌ డేస్‌ తర్వాత సీన్‌ రివర్స్‌. ఇక నుంచి ఈ సినిమా రాబట్టాల్సిన మొత్తం కొండంత. రిలీజ్‌కి ముందు మా సినిమా ఇంత ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది, అంత చేసిందని గొప్పలు పోయిన పబ్లిసిటీ బ్యాచ్‌ ఇపుడు రికవరీ ఎంత చేయాలో చెప్పట్లేదు. సైలెంటయింది.

మిగతా భాషల వసూళ్ల గురించి పక్కన పెడుదాం. తెలుగునాట ఈ సినిమాకి దాదాపు 120 కోట్ల రూపాయల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ విలువ ఉంచారు. చాలా ఏరియాల్లో అడ్వాన్స్‌ పద్దతిలోనే సినిమా విడుదలయింది. అంటే ఇచ్చిన అడ్వాన్స్‌ కన్నా తక్కువ వసూళ్లు వస్తే... ఆ డిస్ట్రిబ్యూటర్‌కి నిర్మాతలు తిరిగి కర్చులతో సహా లెక్క కట్టి ఇవ్వాలి. సీడెడ్‌ ఏరియాల్లో సగానికి సగం పోయేలా ఉంది. ఆంధ్రాలో కొన్ని ఏరియాల్లో 30 శాతం, మరికొన్ని జల్లాల్లో 40 శాతం పోయేలా ఉంది. నైజాంలో పెద్దగా పోయేదేమి లేదు.

120 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ వాల్యూకి ఇప్పటి వరకు 70 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇంకా 50 కోట్లు రావాలి. థియేటర్లు తగ్గాయి. ఆక్యుఫెన్సీ దారుణంగా పడిపోయింది. ఈ సినిమా మళ్లీ కాస్తా లేవాలంటే... వీకెండ్ రావాలి. మొదటి వారం వీక్‌డేస్‌లోనే మరీ వీక్‌గా ఉంది. ఆ తర్వాత ఎలా ఉండనుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంటే ఈ సినిమా తెలుగునాట లాస్‌ వెంచర్‌. లాస్‌ ఎంత అనేది రెండు వారాల తర్వాత తేలుతుంది.