సమ్మర్ ఎట్రాక్షన్ గా సాహో

Saaho releasing this summer
Friday, February 28, 2020 - 09:15

సాహో సినిమా ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చేసింది. అటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో కూడా ఈ సినిమా ఆల్రెడీ కంటిన్యూ అవుతోంది. మరి కొత్తగా వచ్చేదేంటని ఆలోచిస్తున్నారా? ఈ సినిమా ఇంకా బుల్లితెరపై రిలీజ్ కాలేదు. ఆ రిలీజే ఈ సమ్మర్ లో షురూ కాబోతోంది.

ఈ మార్చి నెలాఖరుకు లేదా ఏప్రిల్ నెలలో సాహో సినిమా టీవీల్లో ప్రత్యక్షం కాబోతోంది. ఎట్టకేలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. ఈ సినిమా హిందీ శాటిలైట్ రైట్స్ ను కూడా జీ నెట్ వర్కే దక్కించుకుంది. హిందీలో టెలికాస్ట్ కూడా చేసింది. దానికి మంచి రేటింగ్ రావడంతో ఇప్పుడు తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా కొనుగోలు చేసింది. 

ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా వచ్చేసినప్పటికీ హిందీలో మంచి రేటింగ్ రావడంతో ఇప్పుడు తెలుగు వెర్షన్ పై నమ్మకాలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ గా ఈ సినిమా పెద్దగా నడవలేదు. దీంతో స్మాల్ స్క్రీన్ పై సాహోకు మంచి రేటింగ్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది ఆ ఛానెల్.