ఎన్నాళ్లకు బయటకొచ్చావ్ సుజీత్

Saaho Sujeeth finally comes out
Friday, January 31, 2020 - 19:45

సుజీత్ గుర్తున్నాడా..
నిజంగానే ఈ ప్రశ్న అడగాల్సిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే చాలామంది మరిచిపోయారు కూడా. అవును.. సాహో సినిమా డైరక్టర్ సుజీత్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సాహో తర్వాత పూర్తిగా కనిపించడం మానేసిన సుజీత్ ఎట్టకేలకు బయటకొచ్చాడు. అది కూడా ఓ సినిమా ఓపెనింగ్ కు రావడం విశేషం.

సుశాంత్ హీరోగా రీసెంట్ గా లాంఛ్ అయిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమా లాంఛింగ్ కు సుజీత్ వచ్చాడు. అలా సాహో రిలీజైన ఇన్ని నెలలకు సుజీత్ కెమెరా కంటికి చిక్కాడు. అయితే ఓపెనింగ్ కు వచ్చాడనే మాటే గానీ, అక్కడ కూడా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు. అతికష్టమ్మీద ఓ 2 ఫొటోలకు మాత్రం పోజులివ్వగలిగాడు.

సాహో రిలీజ్ తర్వాత సుజీత్ పై చాలా ట్రోలింగ్ నడిచింది. అజ్ఞాతవాసి సినిమానే తిప్పితీశారంటూ కామెంట్స్ పెట్టారు చాలామంది. ఒక దశలో లార్గోవించ్ డైరక్టర్ కూడా దీనిపై ట్వీట్ చేయడంతో సుజీత్ పూర్తిగా బయటకు రావడం మానేశాడు. సినిమా రిలీజ్ టైమ్ లో అతడికి తీవ్రమైన జ్వరం కూడా రావడంతో ప్రమోషన్ లో కూడా పాల్గొనలేదు. ఆ తర్వాత మీడియా ముందుకు రావాల్సిన అవసరం కూడా రాలేదు.

చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఈ యంగ్ డైరక్టర్, మీడియాతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. హీరో ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానంటున్నాడు సుజీత్. సుశాంత్ మూవీ ఓపెనింగ్ కు రావడంతో అతడు సుశాంత్ నే డైరక్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ అప్పుడే గాసిప్స్ ఊపందుకున్నాయి.