సామజవరగమన నచ్చలేదన్నారు: థమన్

Samajavaragamana song was initially got rejected: Thaman
Tuesday, December 31, 2019 - 10:00

సూపర్ హిట్ అయిన సామజవరగమన సాంగ్ ను విమర్శించిన వాళ్లు ఎవ్వరూ లేరు.  అందరికీ ఈ పాట బాగా నచ్చింది. అయితే దీని వెనక గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టాడు తమన్. నిజానికి పాట చాలా స్లోగా ఉందని సినిమా యూనిట్ లో జనాలే విమర్శించారని చెప్పుకొచ్చాడు.

"నిజానికి ఆ పాట కంపోజ్ చేసిన కొత్తలో చాలా విమర్శలొచ్చాయి. పాట స్లోగా ఉందన్నారు. బన్నీ ఎనర్జీకి, టెంపోకు సింక్ అవ్వదన్నారు. అందుకే సామజవరగమన కు రెండో ఆప్షన్ గా రాములో రాముల ట్యూన్ ను పెట్టుకున్నాం. అదైతే కాస్త ఫాస్ట్ గా ఉంటుందని భావించాను. కానీ వినగా వినగా సామజవరగమనే అందరికీ నచ్చేసింది. ఎంతలా అంటే ఆ పాటనే ఫస్ట్ రిలీజ్ చేశాం. ఆ పాట కోసం సెట్ వేసి మరీ ఆర్కెస్ట్రా చేశాం. దానికి మరో 9 లక్షలు ఖర్చయింది."

కొన్ని పాటలు హిట్ అవుతాయని  అస్సలు ఊహించలేమని, సామజవరగమన తమకు అలాంటి షాకిచ్చిందని చెప్పుకొచ్చాడు తమన్. ఈ పాట ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ అంటున్నాడు. సామరజవరగమన అనే వర్డింగ్ తో పాట ప్రారంభమవ్వాలని సూచించింది కూడా త్రివిక్రమే అని చెప్పుకొచ్చాడు తమన్.

"సామజవరగమన సాంగ్ పుట్టడానికి కారణం త్రివిక్రమ్. ఆయనపై నాకున్న ప్రేమ ఆ పాట అంత బాగా వచ్చేలా చేసింది. త్రివిక్రమ్ ఇన్ పుట్స్ వల్లనే ఆ పాట అంత బాగా వచ్చింది. సామజవరగమన అనే పదంతో పాట స్టార్ట్ అయితే బాగుంటుందనేది కూడా త్రివిక్రమ్ ఆలోచనే. అక్కడ్నుంచి మొదలుపెట్టి సీతారామశాస్త్రి గారు పాట మొత్తం రాసేశారు."

కేవలం ఆడియో పరంగానే కాకుండా, వీడియో పరంగా కూడా ఈ పాట పెద్ద హిట్ అవుతుందంటున్నాడు తమన్. హిమాలయాస్ కు వెళ్లినప్పుడు రోజాలో పాట ఎలాగైతే గుర్తొస్తుందో.. పారిస్ కు వెళ్లినప్పుడు సామజవరగమన సాంగ్ అందరికీ గుర్తొస్తుందంటున్నాడు తమన్.