నేను, సమంత ఒకే కారులో వెళ్లడం లేదు

Samantha and I don't travel in same car: Chaitanya
Thursday, November 1, 2018 - 23:30

నాగచైతన్య, సమంత కలిసి ఓ సినిమా చేస్తున్నారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న మొదటి సినిమా ఇదే. ఎంచక్కా నిద్రలేచిన తర్వాత ఒకేసారి రెడీ అయి, ఒకే కారులో సెట్స్ పైకి వచ్చేయొచ్చు. కానీ సమంత, తను ఒక కారులో షూటింగ్ వెళ్లడం లేదంటున్నాడు నాగచైతన్య.

"అవును.. ఇద్దరం కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నాం. కానీ ఒకే కారులో వెళ్లడం లేదు. నేను తొందరగా రెడీ అయిపోతాను. కానీ సమంత మాత్రం చాలా టైం తీసుకుంటోంది. అందుకే ముందు నేను సెట్స్ కు వెళ్లిపోతున్నాను. తర్వాత సమంత వస్తోంది."

ఇలా సమంత మేకప్ కు టైమ్ తీసుకుంటోందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు నాగచైతన్య. ఇక సినిమాలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూ.. రియల్ లైఫ్ లో ఉన్నట్టే సినిమాలో కూడా తామిద్దరం భార్యాభర్తలుగా నటిస్తున్నామని తెలిపాడు చైతూ. అయితే సినిమాలో భార్యభర్తల పాత్రలు తరచుగా గొడవ పడుతుంటాయని, రియల్ లైఫ్ లో మాత్రం తమ మధ్య అలాంటి గొడవలు లేవని స్పష్టంచేశాడు.

శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు "మజిలీ" అనే టైటిల్ పెట్టారు. అయితే ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.