పదిని పాతరేసిన బుల్లితెర

Samantha's 10 TV premiere is a dud
Thursday, June 18, 2020 - 17:15

బుల్లితెర ప్రేక్షకులకు రిపీట్ సినిమాలతో మొహం మొత్తిందా? ఈ వారం (జూన్ 6-జూన్ 12) రేటింగ్ చూస్తే ఇలానే అనిపిస్తోంది. లాక్ డౌన్ టైమ్ లో వేసిన ప్రతి సినిమాకు రేటింగ్ వచ్చింది. ఎంతలా అంటే డిజాస్టర్ అయిన "90ml" సినిమాకు, చివరికి హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు కూడా రేటింగ్స్ వచ్చాయి. కానీ ఆడియన్స్ అయినా ఎన్నాళ్లు చూసిన సినిమాలే చూస్తారు. ఆ ప్రభావం ఈ వారం టీఆర్పీల్లో కనిపించింది. మళ్లీ మళ్లీ ప్రసారం చేసిన "రచ్చ", "అత్తారింటికి దారేది", "ఇస్మార్ట్ శంకర్" లాంటి సినిమాలకు చెప్పుకోదగ్గ రేటింగ్ రాలేదు.

మరోవైపు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ పేరిట ఫ్రెష్ గా వేసిన సినిమాల్ని కూడా ప్రేక్షకులు తిప్పికొట్టారు. పేరుకు ఇవి కొత్త సినిమాలైనా సరుకు లేకపోవడమే దీనికి కారణం. ఉదాహరణకు "10" అనే సినిమానే తీసుకుంటే.. విక్రమ్-సమంత నటించిన ఈ సినిమా చాలా పాతది. బుల్లితెరకు మాత్రం కొత్త. కానీ రేటింగ్ మాత్రం అత్యల్పం (3.03). ఇంకా చెప్పాలంటే టాప్-10లో కూడా దీనికి చోటు దక్కలేదు.

టాప్-3లో "సూర్యవంశం", "గీతగోవిందం", "స్నేహితుడు (విజయ్)" లాంటి సినిమాలు నిలిచినప్పటికీ వీటి రేటింగ్స్ నామమాత్రమే. టోటల్ లిస్ట్ లో ఏ ఒక్క సినిమాకు టీఆర్పీ కూడా  5 రేటింగ్ రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రిపీట్ మూవీస్ ను ప్రేక్షకులు తిప్పికొట్టారనే విషయం దీంతో స్పష్టమౌతోంది.

అటు శ్రీవిష్ణు నటించిన "తిప్పరా మీసం", సందీప్ కిషన్ చేసిన "రన్" అనే సినిమాలు కూడా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ గా ప్రసారమైనప్పటికీ చెప్పుకోదగ్గ రేటింగ్స్ రాలేదు. ఓవరాల్ గా చూసుకుంటే.. ఈవారం రేటింగ్స్ లో మెరిసిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.

అదృష్టవశాత్తూ టీవీ సీరియల్స్, ఇతర కార్యక్రమాలకు సంబంధించి షూటింగ్స్ మొదలయ్యాయి. వచ్చే వారం నుంచి సీరియల్స్, జబర్దస్త్, ఢీ లాంటి కార్యక్రమాలు ఫ్రెష్ గా మళ్లీ కనువిందు చేయబోతున్నాయి. సరిగ్గా సినిమాలకు రేటింగ్స్ తగ్గిన సమయానికి ఇవి అందుబాటులోకి రావడంతో ఛానెళ్లన్నీ బతికిపోయాయి.