అభిమానికి సమంత వార్నింగ్

Samantha's warning to a fan
Friday, February 21, 2020 - 21:30

ఎప్పుడూ నవ్వుతూ క్యూట్ గా కనిపించే సమంత ఒక్కసారిగా కోప్పడితే ఎలా ఉంటుంది? రియల్ లైఫ్ లో సమంత కోపం ఎవరైనా చూశారా? ఓ అభిమానికి మాత్రం అది అనుభవంలోకి వచ్చింది. సమంత కోపాన్ని అతడు కళ్లజూశాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘటన, దానికి సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తన ప్రతి సినిమాకు తిరుమల కొండకు వెళ్లడం సమంతకు అలవాటుగా మారింది. అది కూడా ఆమె నేరుగా కొండపైకి వెళ్లిపోదు. మెట్ల మార్గంలో నడిచి కొండ ఎక్కి, శ్రీవారిని దర్శించుకుంటుంది. జాను రిలీజ్ టైమ్ లో కూడా అదే పనిచేసింది. మెట్ల దారిలో కొండ ఎక్కింది. ఆ సమయంలో ఓ అభిమాని సమంతను అదే పనిగా ఫొటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టాడు.

ఫ్యాన్స్ అన్నతర్వాత ఫొటోలు, సెల్ఫీలు దిగడం కామన్. చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి వీడియోలు కూడా తీస్తారు. సమంత ఎవరికీ అభ్యంతరం చెప్పలేదు. నవ్వుతూ ఫొటోలుకు పోజులిస్తూ ముందుకుసాగిపోయింది. అయితే ఒక్కడు మాత్రం సమంతను అదే పనిగా ఫాలో అయ్యాడు. ఏకథాటిగా ఫొటోలు, వీడియోలు తీస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన సమంత ఆతడికి వార్నింగ్ ఇచ్చింది. ఇక తీసింది చాలు అదే పనిగా ఫొటోలు తీయకు అంటూ తమిళ్ లో వార్నింగ్ ఇచ్చింది. కాస్త ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.