సంక్రాంతి సినిమాలకు కొత్త రిలీజ్ డేట్స్

Sankrathi 2020 movies get release dates on streaming sites
Sunday, February 2, 2020 - 10:45

అదేంటి.. సంక్రాంతి సినిమాలన్నీ వచ్చేశాయి కదా. వాటి రిజల్ట్స్, బాక్సాఫీస్ లెక్కలు కూడా తేలిపోయాయి. మరి ఇప్పుడు కొత్తగా మళ్లీ రిలీజ్ డేట్స్ ఏంటని అనుకుంటున్నారా? అవును.. సంక్రాంతి సినిమాల డిజిటల్ రిలీజ్ డేట్స్ వచ్చాయిప్పుడు. సంక్రాంతికి ముందు రిలీజైంది కాబట్టి.. డిజిటల్ వేదికపై కూడా ముందుగానే వస్తోంది దర్బార్ మూవీ. రజనీకాంత్ నయనతార జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న (సన్ నెక్ట్స్) స్ట్రీమింగ్ కు రాబోతోంది.

సంక్రాంతి రోజున విడుదలైన ఎంత మంచివాడవురా సినిమాను ఫిబ్రవరి 29న (అమెజాన్ ప్రైమ్ వీడియోస్) డిజిటల్ స్ట్రీమింగ్ లో పెట్టబోతున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో, కాస్త ముందుగానే ఇలా నెట్ లో ప్రత్యక్షం కాబోతోందన్నమాట.

ఇక సంక్రాంతి బరిలో సూపర్ హిట్స్ అయిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు కూడా వీలైనంత త్వరగానే డిజిటల్ వేదికలపైకి రాబోతున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాను మార్చి 7న (అమెజాన్ ప్రైమ్ వీడియోస్) స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు. ఇక బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాను అతడి పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న (సన్ నెక్ట్స్) స్ట్రీమింగ్ కు ఉంచుతారు. ఇలా సంక్రాంతి సినిమాలన్నీ దశలవారీగా ఏప్రిల్ 8లోపు అన్నీ డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చేయబోతున్నాయి.