న‌ట‌నే, నో డైర‌క్ష‌న్‌

Saptagiri says no to direction
Wednesday, September 19, 2018 - 19:30

ఆ ప్ర‌చారాన్ని న‌మ్మొద్దు అంటున్నాడు స‌ప్త‌గిరి. ఈ క‌మెడియ‌న్ హ‌వా కొంత త‌గ్గిందిపుడు. హాస్య నటుడిగా కెరియ‌ర్ ఫిఫ్త్ గేర్‌లో వెళ్తున్నపుడు యూట‌ర్న్ తీసుకొని హీరో అయ్యాడు. బండి ఫ‌ల్టీ కొట్టింది. దాంతో అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. అందుకే ఇక ఇపుడు డైర‌క్ష‌న్ వైపు చూపు వేశాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇది అబ‌ద్ద‌మ‌ని అంటున్నాడు. 

ఇటీవల వి.వి.వినాయ‌క్ స్వ‌గ్రామం అయిన చాగ‌ల్లు వెళ్లాడు స‌ప్త‌గిరి. అక్క‌డ వినాయ‌క ఉత్స‌వాల్లో పాల్గొన్నాడు. ఆ సంద‌ర్భంలో తాను డైర‌క్ట‌ర్ అవ్వాల‌నే ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని, ఎప్ప‌టికైనా మెగాఫోన్ ప‌డుతాన‌ని చెప్పాడు. అ మాట కాస్తా అటు ఇటు మారి ...స‌ప్త‌గిరి వెంట‌నే డైర‌క్ట‌ర్‌గా మారుతున్నాడ‌న‌ట్లుగా యూట్యూబ్‌లోకి వ‌చ్చింది. డైర‌క్ట‌ర్ అవ‌బోతున్నాడ‌ని తెలిస్తే వ‌చ్చే ఆ కొన్ని వేషాలు కూడా హుష్‌కాకి అంటాయ‌నే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించిన స‌ప్త‌గిరి వెంట‌నే డ్యామేజ్ కంట్రోల్ మొద‌లుపెట్టాడు. 

హీరో అవకాశాలు, క‌మెడియ‌న్ వేషాల‌ను వ‌దులుకొని డైర‌క్ష‌న్ చేసే ఆలోచ‌న లేద‌ని ఇపుడు క్లారిటీ ఇచ్చాడు.  స‌ప్త‌గిరి చేతిలో ఇపుడు మూడు సినిమాలున్నాయ‌ట‌.