'సరిలేరు' 50 డేస్ ఫంక్షన్ ఉందా?

Sarileru Neekevvaru to hold 50 days function?
Thursday, February 13, 2020 - 09:45

50 రోజులు, 100 రోజుల వేడుకలు ఎప్పుడో మాయమైపోయాయి. నిజంగా ఓ సినిమా 50 రోజలు ఆడినా పోస్టర్ వదిలి చేతులు దులుపుకుంటున్నారు కానీ, ఫంక్షన్ పెట్టి వేడుక చేయడం లేదు. అలా చరిత్రలో కలిసిపోయిన 50 రోజుల వేడుకను మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నిర్మాత అనీల్ సుంకర. సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి 50 డేస్ ఫంక్షన్ చేయాలనుకుంటున్నాడు.

జనవరి 11న థియేటర్లలోకి వచ్చింది సరిలేరు నీకెవ్వరు సినిమా. సంక్రాంతి బరిలో భారీ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం 5వ వారంలోకి ఎంటరైన ఈ సినిమా.. ఈనెల 29కి 50 రోజులు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భంగా మరోసారి డీటెయిల్డ్ కలెక్షన్ రిపోర్ట్ ను రిలీజ్ చేయడంతో పాటు.. భారీ వేడుక నిర్వహించాలని అనుకుంటున్నారు.

ఈ సినిమాతో ఇప్పటికే అంతా కట్ అయ్యారు. సినిమా థియేటర్లలో ఉన్నప్పటికీ హీరోహీరోయిన్లతో పాటు మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ అంతా ఎవరి పనిలో వారు పడిపోయారు. ఇలాంటి టైమ్ లో 50 రోజుల ఫంక్షన్ పెడితే వీళ్లంతా వస్తారా అనేది డౌట్. అయితే ఎవరు వచ్చినా రాకున్నా మహేష్ మాత్రం తప్పకుండా వస్తాడు. ఎందుకంటే, అతడ్ని అడిగి, డేట్ తీసుకున్న తర్వాతే ఫంక్షన్ ఫిక్స్ చేస్తారు. మహేష్ రానంటే ఇక 50 రోజుల ఫంక్షన్ లేనట్టే.