మార్చి 8న స‌ర్వం తాళ‌మ‌యం

Sarvam Thaalamayam on March 8th
Sunday, March 3, 2019 - 13:45

జి.వి.ప్ర‌కాష్‌, అప‌ర్ణ బాల‌ముర‌ళి జంట‌గా న‌టించిన చిత్రం `స‌ర్వం తాళ‌మ‌యం`. ద‌ర్శ‌కుడు రాజీవ్ మీన‌న్ తెరకెక్కించారు. రాజీవ్ మీన‌న్ గ‌తంలో "మెరుపు క‌ల‌లు",  "ప్రియురాలి పిలిచింది" వంటి సినిమాలు తీశారు.  మార్చి 8న విడుద‌ల కానుంది. 

"ఈ చిత్రంలో సంగీతం, మెరిట్‌, గెలుపు ఓట‌ముల గురించి ప్ర‌స్తావించాం. గురుశిష్యుల సంబంధం గురించి కూడా చెప్పాం. మృదంగం త‌యారుచేసేవాళ్ల‌కు వాయించ‌డం చేత‌కాదు. ఒక‌వేళ వారే గ‌నుక మృదంగం నేర్చుకుంటే ప‌రిస్థితి ఏంట‌నే విష‌యం మీద ఈ సినిమా చేశాం," అని సినిమా దేని గురించో చెప్పారు రాజీవ్ మీన‌న్‌.

ఈ సినిమాకి ఏ ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందించాడు. 

"రెహ‌మాన్ దిలీప్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచీ నాకు చాలా ఇష్టం. ఒక‌సారి నేను బాయిల‌ర్ ఇండ‌స్ట్రీ మీద ఓ యాడ్ చేస్తే దానికి ఫ్యూజ‌న్ సంగీతాన్నిచ్చారు దిలీప్.  త‌ర్వాత దాదాపు 150-200 జింగిల్స్ చేశాం మేం. ఆ క్ర‌మంలోనే అత‌నికి `రోజా` వ‌చ్చింది. న‌న్ను `మెరుపుక‌ల‌లు` సినిమాకు ద‌ర్శ‌కుడిని చేసింది కూడా రెహ‌మానే," అని తెలిపారు రాజీవ్ మీన‌న్‌.

"ఏవీయం సంస్థ వారు మంచి సినిమా చేయాల‌నుకున్నారు. దానికి రెహ‌మాన్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా పెట్టుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే రెహ‌మాన్ వాళ్ల‌కు అందుబాటులోకి వెళ్ల‌క‌పోవ‌డంతో న‌న్ను పిలిచి రెహ‌మాన్ గురించి అడిగారు. నేను రెహ‌మాన్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి `పెద్ద సంస్థనుంచి పిలుపు వ‌చ్చిన‌ప్పుడు వెళ్లి ఏదో ఒక‌టి చెప్పు` అని అన్నాను. ఆ రోజు అత‌నితో పాటు నేను కూడా ఏవీయం సంస్థ‌కు వెళ్లా. రెహ‌మాన్ వాళ్ల‌తో `ద‌ర్శ‌కుడిని డిసైడ్  చేశారా` అని అడిగారు. అందుకు వాళ్లు ఇప్ప‌టికి ప్ర‌భుదేవా మాత్ర‌మే ఓకే అయ్యారు. ఇంకా ఎవ‌రినీ డిసైడ్ చేయ‌లేదు` అని అన్నారు. `వేరే ఎవ‌రో ఎందుకు? మ‌న రాజీవ్‌ని చేసేయండి` అని రెహ‌మాన్ న‌న్ను సిఫార‌సు చేశారు. అలా నేను `మెరుపు క‌ల‌లు` చేశాను. దాని త‌ర్వాత `ప్రియురాలు పిలిచింది` వ‌చ్చింది," అని రాజీవ్ మీన‌న్ రెహ‌మాన్‌తో త‌న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

"దాదాపు 19  ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ సినిమా చేశాను. ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేస్తాను. సంగీతం ప్ర‌ధానంగా ఈ క‌థ‌ను చెప్పాల‌ని అనుకున్న‌ప్పుడు చాలా వ‌ర్క్ చేశాం. ద‌ళిత అంశాన్ని కూడా ట‌చ్ చేశాం. తెలుగులో ఈ నెల 8న విడుద‌ల చేస్తున్నాం. కె.విశ్వ‌నాథ్‌గారు సినిమాను చూసి క్లైమాక్స్ లో క‌ళ్ల‌నీళ్లు పెట్టుకుని నా నుదుటిమీద ముద్దుపెట్టుకున్న స‌న్నివేశాన్ని మ‌ర్చిపోలేను," అని అన్నారు రాజీవ్ మీన‌న్‌.