సరిలేరు సీక్రెట్స్ చెప్పిన సత్యదేవ్

Satyadev reveals about his role in Sarileru Neekevvaru
Wednesday, November 20, 2019 - 18:30

రీసెంట్ గా లైమ్ లైట్లోకి వచ్చిన హీరో సత్యదేవ్. జ్యోతిలక్ష్మితో ప్రారంభిస్తే.. రీసెంట్ గా వచ్చిన బ్రోచేవారెవరురా, ఇస్మార్ట్ శంకర్ సినిమాల వరకు ఎన్నో మంచి పాత్రలు పోషిస్తున్నాడు. ఇప్పుడీ నటుడు మహేష్ తో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమాలో తన పాత్ర గురించి, మహేష్ గురించి చెప్పుకొచ్చాడు సత్య.

"సరిలేరు నీకెవ్వరు సినిమాలో నాది చాలా కీలకమైన పాత్ర. అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే, ఆ సినిమా గురించి వాళ్లే ఏం చెప్పడం లేదు. చిన్న పాత్ర పోషించిన నేను ఇప్పుడే మాట్లాడితే బాగుండదు. కానీ నా పాత్ర మాత్రం సినిమాలో చాలా చాలా కీలకమైనది. తక్కువ టైమ్ కనిపిస్తాను కానీ అందరికీ రిజిస్టర్ అయిపోతుంది."మహేష్ తో గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు సత్యదేవ్. ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ బాగుంటుందని అంటున్నాడు. తన ఎక్స్ పీరియన్స్ తో మహేష్ చెప్పే విషయాలు చాలా బాగుంటాయంటున్నాడు.

"మహేష్ ఓ సూపర్ స్టార్. ఆయనతో పనిచేయడం అనేది ఓ మంచి అనుభూతి. మహేష్ ను చూస్తే అలా చూడాలనిపిస్తుంది. ఆయన సెట్స్ కు వస్తే ఒక రకమైన సందడి. మహేష్ గారితో గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా చేశాను. ఆ సినిమాలో మహేష్ గారికి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకడ్ని నేను."

మహేష్ సినిమాలో ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన తను, ఇప్పుడు అదే మహేష్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగానని.. ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉందంటున్నాడు సత్యదేవ్.