ఈ సారి చిరుని వాడేస్తోన్న‌ ష‌క‌ల‌క‌

Shakalaka Shankar uses Chiru's iconic movie title
Friday, September 28, 2018 - 17:15

ఖైదీ.. చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం. అతడికి సుప్రీమ్ హీరో ఇమేజ్ ను కట్టబెట్టిన సినిమా. 150 సినిమాలు కంప్లీట్ చేసినా, ఇప్పటికీ తన కెరీర్ లో బెస్ట్ చిత్రం చెప్పమంటే చిరంజీవి మొదట చెప్పే సినిమా ఖైదీనే. అంతలా మెగాస్టార్ కెరీర్ లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ టైటిల్ ను ఇప్పుడో చిన్న కమెడియన్ తన సినిమాకు వాడుకోబోతున్నాడు. అతడే షకలక శంకర్. అవును.. ఖైదీ టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు షకలక శంకర్.

ఇప్పటికే హీరోగా మారిన ఈ హాస్యనటుడు, ఇప్పుడు ఏకంగా చిరంజీవి హిట్ సినిమా టైటిల్ నే వాడేస్తున్నాడు. చిరంజీవి కెరీర్ ను ఖైదీ సినిమా ఎలా మలుపు తిప్పిందో, తన కెరీర్ ను కూడా ఈ ఖైదీ అంతలా ఓ మలుపు తిప్పేస్తుందని ఆశగా చెబుతున్నాడు శంకర్. సూపర్ హిట్ టైటిల్స్ ను కాపీ కొట్టడం శంకర్ కు కొత్తేంకాదు. ఇప్పటికే డ్రైవర్ రాముడు పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. అది పెద్ద ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా. కేడీ నంబర్ -1 పేరుతో మరో సినిమా చేస్తున్నాడు. ఇది కృష్ణ నటించిన సినిమా. ఇప్పుడు ఖైదీ అనే టైటిల్ ను కూడా వాడేస్తున్నాడు.