'నా కూతుర్ని షూటింగ్ పంపను'

Shakti Kapoor: Will not allow Shraddha to shoots
Friday, June 12, 2020 - 22:15

"సాహో" సినిమాతో తెలుగులో కూడా పాపులరైన ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. సాహో తర్వాత ఆమె తెలుగులో మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. హిందీలో మాత్రం ఆమె ఫుల్ బిజీగా ఉంది. షూటింగ్స్ మొదలవ్వగానే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అని ఈమధ్యే ప్రకటించింది. అయితే ఆమె ఉత్సాహానికి బ్రేకులేశాడు తండ్రి శక్తి కపూర్.

"నేను బయటకు వెళ్లను, ఇప్పట్లో పని చేయను. నా కూతుర్ని కూడా షూటింగ్స్ కు పంపించను. కరోనా భయం పోయిందని నేను అనుకోవడం లేదు. ఇంకా దుర్భరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ప్రస్తుతానికైతే నా అమ్మాయిని బయటకు పంపించను. షూటింగ్స్, పని ఇంపార్టెంట్ అనే విషయం నాకు తెలుసు. కానీ ప్రాణం కంటే అవి ముఖ్యం కాదు కదా. ఇప్పటికిప్పుడు షూటింగ్స్ మొదలుపెడితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది."

ఇలా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు శక్తి కపూర్. నిజానికి శ్రద్ధాకపూర్ చేతిలో ఇప్పటికిప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాలేం లేవు. కాకపోతే ఆమె రణబీర్ కపూర్ హీరోగా లవ్ రంజన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటించే ఛాన్స్ ఉంది. దానికోసం ఆమె ప్రిపేర్ అవుతోంది.