తెరపైకి మరోసారి శివాజీరాజా

Shivaji Raja is back in action
Friday, January 3, 2020 - 17:30

మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా చిరంజీవి-రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో.. మాజీ మా అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి తెరపైకొచ్చారు. రాజశేఖర్, నరేష్ పై విమర్శలు చేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న శివాజీరాజాకు ఇన్నాళ్లకు ఈ రూపంలో అవకాశం రానే వచ్చింది. దీంతో శివాజీరాజా మరోసారి నరేష్ పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈసారి ఆయన రాజశేఖర్ ను వెనకేసుకొని రావడం విశేషం.

ఎన్నికలు జరిగి ఇన్నిరోజులై, పదవి అనుభవిస్తున్న అధ్యక్షుడు ఇప్పటివరకు ఒక్క రూపాయికి కూడా లెక్క చెప్పలేకపోవడం విడ్డూరం అన్నారు శివాజీరాజా. తన హయాంలో భారీగా అవినీతి, కుంభకోణం జరిగిందని ఆరోపించిన ప్రస్తుతం "మా" కమిటీ.. ఎందుకు ఇంతవరకు నిరూపించలేదని ప్రశ్నించారు.  ఇప్పటికైనా మా అసోసియేషన్ సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు శివాజీరాజా.

తాజాగా జరిగిన వివాదంలో రాజశేఖర్ ను వెనకేసుకొచ్చారు శివాజీరాజా. రాజశేఖర్ ను తప్పు పట్టొద్దని, అతడి ఎమోషన్ లో అర్థం ఉందని అన్నారు. అసోసియేషన్ కు 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చి కూడా ఆయన పైకి చెప్పుకోలేదని, అలాంటి సింప్లిసిటీ కలిగిన వ్యక్తి మాటల్ని వినాలని కోరారు. రాజశేఖర్ తన పదవికి రిజైన్ చేయడం బాధాకరమన్న శివాజీరాజా.. ఇకనైనా అసోసియేషన్ పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ, పరోక్షంగా నరేష్ పై విమర్శలు గుప్పించారు.