లాక్ డౌన్ పై పుస్తకం రాస్తా

Sonu Sood says he will write a book on lockdown.
Wednesday, July 15, 2020 - 18:45

లాక్ డౌన్.. దేశంలో ప్రతి ఒక్కరికి ఇదొక కొత్త అనుభవం. సెలబ్రిటీల్లో కొందరు ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంటికే పరిమితం అవ్వగా, మరికొందరు మాత్రం పేదలకు తోచినంత సహాయం చేశారు. వీళ్లలో అందరికంటే ముందున్నాడు సోనూ సూద్. లాక్ డౌన్ టైమ్ లో అందరి హృదయాలు గెలుచుకున్న ఈ నటుడు... తన అనుభవాలతో ఓ పుస్తకం రాస్తానని ప్రకటించాడు.

లాక్ డౌన్ టైమ్ లో సోనూ సూద్ చాలా ఛారిటీ చేశాడు. రవాణా సౌకర్యం లేక ఇరుక్కుపోయిన వందలాది మంది కార్మికుల్ని వాళ్ల ఇంటికి పంపించే ఏర్పాటుచేశాడు. వేలాది మందికి ప్రతి రోజూ అన్నం పెట్టాడు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉండడం కోసం తన స్టార్ హోటల్ ను ఇచ్చేశాడు.

కార్మికుల్ని వాళ్ల సొంత రాష్ట్రాలకు పంపించేందుకు సోనూ చాలా కష్టపడ్డాడు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ, అనుమతులు తీసుకొని, తనే స్వయంగా బస్సులు ఏర్పాటుచేసి వాళ్లను గమ్యస్థానాలకు చేర్చాడు. అలా రోజుకు 16 నుంచి 18 గంటలు కార్మికులతోనే గడిపేవాడు.

ఇలా తన జీవితకాలానికి సరిపడే అనుభవాల్ని సంపాదించిన ఈ నటుడు.. ఆ అనుభవాలతో ఓ పుస్తకం రాస్తానని ప్రకటించాడు. పెంగ్విన్ రాండమ్ హౌజ్ ఇండియా సంస్థ తన పుస్తకాన్ని ప్రచురించేందుకు ముందుకొచ్చిందని కూడా తెలిపాడు. ఇలా తను చూసిన వాస్తవ ఘటనల్ని పుస్తకరూపంలోకి తీసుకొచ్చి శాశ్వతంగా నిలిచిపోయేలా చేయాలనేది తన ఉద్దేశమని ప్రకటించాడు సోనూ సూద్.