ఆచార్యలో సోను సూద్ కీలకం

Sonu Sood talks about his role in Acharya
Monday, May 25, 2020 - 19:30

ఇప్పుడు ఎక్కడ చూసినా సోనూ సూద్ పేరు మార్మోగుతోంది. మైగ్రంట్ లేబర్ కి ముంబై నుంచి యూపీ, బీహార్, ఒడిస్సా, బెంగాల్...ఇలా తదితర ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ లాక్ డౌన్ టైమ్ లో చాలా ఛారిటీ చేస్తున్నాడు సోనూ సూద్. వేల మంది పేదలకు రోజూ అన్నం పెట్టడంతో పాటు ఇంకా ఏంతో సహాయం చేస్తున్నాడు. అంతేకాదు.. ముంబయిలోని తన స్టార్ హోటల్ ను కూడా ఈ కష్టకాలంలో మెడికల్ సిబ్బందికి వాడుకోమని ఇచ్చేశాడు. ఇదంతా తను ప్రచారం కోసం చేయడం లేదని, తన బాధ్యతగా చేస్తున్నానని, మనసుకు చాలా హాయిగా ఉందని చెబుతున్నాడు సోనూ సూద్.

ఇక సినిమాల విషయానికొస్తే ...తెలుగులో చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్నాడు. కొరటాల శివ సినిమాల్లో హీరో క్యారెక్టర్ మాత్రమే కాకుండా.. ఇతర కీలకమైన పాత్రలు కూడా బలంగా ఉంటాయి. "ఆచార్య" సినిమాలో కూడా అలాంటి ఓ బలమైన పాత్రను పోషిస్తున్నాడు నటుడు సోనూ సూద్. సినిమాలో తనది పాజిటివ్ క్యారెక్టరా.. లేక విలన్ క్యారెక్టరా అనే విషయాన్ని చెప్పలేనని, కానీ తన పాత్రను మాత్రం ప్రతి ఒక్కరు ఇష్టపడతారని అంటున్నాడు.

"ఈమధ్య కాలంలో నేను విన్న బెస్ట్ స్క్రిప్ట్ ఆచార్య. సినిమాలో నా పాత్ర ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కొరటాల శివ, నా క్యారెక్టర్ ను చాలా అద్భుతంగా రాశారు. చిరంజీవితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది."

చిరంజీవి లాంటి నటుడితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందంటున్నాడు సోనూ. మళ్లీ చిరు సర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని అంటున్నాడు.

"చిరంజీవి లాంటి హీరోలు చాలా తక్కువగా ఉంటారు. ఆ స్థాయిలో ఉంటూ అంత వినయంగా ఉండే హీరోను నేను చూడలేదు. ఆయనతో షూట్ చేస్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. అంతేకాదు.. ఎప్పుడూ చాలా పాజిటివ్ గా ఉంటారు. మళ్లీ ఆచార్య సెట్స్ పైకి వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను."