సుధీర్‌బాబు మారువేషం

జనాలు ఏమనుకుంటున్నారు అనేది హీరోలకి అస్సలు రీచ్ కాదు. ఎందుకంటే వారు సాధారణ మనుషుల్లా బయట తిరగలేరు. వారి అనుచరులు గొప్పలు తప్ప నిజాలు చెప్పరు. అందుకే పలువురు హీరోలు మారువేషాలు వేసుకొని మూవీ థియేటర్లకి వెళ్లి ప్రేక్షకుల పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అల్లు అర్జున్ తరుచుగా హిట్టయిన సినిమాలను హైదరాబాద్‌లోని ఏదైనా మాస్ థియేటర్‌కి వెళ్లి చూస్తుంటాడు.
ఇపుడు హీరో సుధీర్‌బాబు సొంత సినిమా టాక్ స్వయంగా తెలుసుకుందామని ప్రయత్నం మొదలుపెట్టాడు. తాను థియేటర్లో ఉన్నానని తెలిస్తే జనం అబద్దం చెపుతారని అనుకున్నాడేమో..మారు వేషాల్లో వెళ్లి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నాడు.
సుధీర్‌బాబు నటించి, నిర్మించిన "నన్ను దోచుకుందువటే" శుక్రవారం విడుదలైంది. కథ, కథనాల పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా..కామెడీ బాగానే వర్కవుట్ అయింది. హీరోయిన్ నభా నటేష్..చేసిన యాక్టింగ్ ప్లస్ అయింది. అందుకే క్రిటిక్స్ యావరేజ్ నుంచి టైమ్‌పాస్ వాచ్ అన్నట్లుగా రేటింగ్ ఇచ్చారు. ఐతే తనే నిర్మాత కావడంతో ఇలా మారు వేషాల్లో జనం టాక్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా ఆడితే..నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాడు.
- Log in to post comments