సుడిగాలి సుధీర్ డబుల్ గేమ్!

Sudigaali Sudheer's double game
Wednesday, July 8, 2020 - 14:00

బుల్లితెరపై సుడిగాలి సృష్టించిన సుధీర్.. ఇప్పుడు వెండితెర వైపు మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నాడు. రావడమే హీరోగా వచ్చిన నటుడు.. ఒకేసారి 2 సినిమాలతో ఎదురుదెబ్బలు తిన్నాడు. ఏదీ ఆడలేదు. సరిగ్గా ఇక్కడే సుడిగాలి సుధీర్ డబుల్ గేమ్ స్టార్ట్ చేశాడు.

ఓవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తానంటున్నాడు సుధీర్. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా, రష్మి హీరోయిన్ గా ఓ సినిమాకు ప్లానింగ్ జరుగుతోంది. దీంతో పాటు అఖిల్ హీరోగా వస్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాలో కూడా ఇతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా అవీ-ఇవీ రెండూ చేస్తానంటున్నాడు 'సుడిగాలి'.

ఇతడు హీరోగా నటించిన "సాఫ్ట్ వేర్ సుధీర్" అనే సినిమా ఫ్లాప్ అయింది. జబర్దస్త్ బ్యాచ్ తో పాటు కలిసి సుధీర్ చేసిన "3 మంకీస్" అనే సినిమా కూడా ఫ్లాప్ అయింది. అయినా తగ్గేది లేదంటున్నాడు ఈ నటుడు. హీరో వేషాలు వేస్తూనే సైడ్ క్యారెక్టర్స్ చేస్తానంటున్నాడు.

ఇతడు హీరోగా నిలదొక్కుకుంటాడా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోతాడా అనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రస్తుతానికైతే రెండు చేతులా సంపాదిస్తున్నాడు.