'జిగేల్ రాణి'కి డబ్బు ఇచ్చిన సుకుమార్

రంగస్థలం సినిమాలో ఐటెంసాంగ్ ఎంత పాపులర్ అయిందో కదా! ఆ పాటలో ఆడిన పూజా హెగ్డేకి లక్షల్లో అమౌంట్‌ని చెల్లించారు నిర్మాతలు. కానీ ఆ పాట పాడిన వెంకటలక్ష్మిని మరిచారు. మన దర్శక, నిర్మాతలు జిగేల్‌ని చూస్తారు కానీ మెరుపులకి కారణమైన బ్యాక్‌గ్రౌండ్ టాలెంట్‌ని పెద్దగా పట్టించుకోరు కదా.
జిగేల్ రాణి పాటకి గళం విప్పిన తనని దేవీశ్రీప్రసాద్ వద్దకి తీసుకెళ్లిన మధ్యవర్తి మోసం చేశాడని, సినిమా హిట్టయి ఇన్ని రోజులైనా తనకి నయాపైసా రాలేదని వెంకటలక్ష్మీ తన బాధని వెళ్లగక్కారు. ఆమె ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన సుకుమార్ వెంటనే స్పందించాడు. తన మంచితనాన్ని చాటుకున్నాడు.
‘జిల్ జిల్ జిగేల్ రాణి’ పాట పాడిన గంటా వెంకటలక్ష్మికి వెంటనే లక్షరూపాయల నగదుని పంపించాడు సుకుమార్. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన ఈ టాలెంటెడ్ సింగర్ ఆనందానికి ఇపుడు అవధుల్లేవు. సుకుమార్ పంపిన డబ్బులు తనకు అందాయని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు సుకుమార్‌కి థ్యాంక్స్ చెప్పారు. తన సంగీత దర్శకత్వంలో పాట పాడిన గాయనీ, గాయకులకి పారితోషికం అందిందా లేదా అన్నది సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ చూసుకోవాలి. కానీ డిఎస్సీకి ఆ సోయి లేదని ప్రూవ్ అయింది. అయితే సుకుమార్ మాత్రం వెంటనే స్పందించి ఆమెకి న్యాయం చేయడం అభినందించాల్సిందే.
- Log in to post comments