ఈ సమ్మర్ అంతా గందరగోళమే

Summer movies in dilemma
Tuesday, March 24, 2020 - 10:15

టాలీవుడ్ కు పెద్ద సీజన్లు రెండే రెండు. ఒకటి సంక్రాంతి, రెండు సమ్మర్. ఈ రెండు సీజన్లలో ఏ ఒక్కటి మిస్సయినా ఇండస్ట్రీ స్లంప్ లోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు అలాంటి ఛాయలే కనిపిస్తున్నాయి. చాలా సినిమాలు ఈ సమ్మర్ ను మిస్సయ్యే ప్రమాదం ఉంది.

గతేడాది సమ్మర్ కు "మజిలీ", "జర్సీ", "మహర్షి", "సీత".. ఇలా అరడజనుకు పైగా చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. "సీత" తప్ప అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాగానే వసూళ్లు సాధించాయి. చివరికి ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన "ఫలక్ నుమా దాస్", "ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ", "బ్రోచేవారెవరురా" లాంటి సినిమాలు కూడా క్లిక్ అయ్యాయి. అలా 2019 సమ్మర్ సూపర్ హిట్ అనిపించుకుంది.

కట్ చేస్తే, ఈసారి సమ్మర్ డీలా పడింది. "V" మూవీతో ఘనంగా ప్రారంభమౌతుందనున్న వేసవి సీజన్ కరోనా కారణంగా డీలా పడింది. ప్రస్తుతం మార్చి సినిమాలన్నీ ఏప్రిల్ కు వచ్చి పడ్డాయి. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన రెడ్, నిశ్శబ్దం లాంటి సినిమాల విడుదలలు డైలమాలో పడ్డాయి. ఇలా రిలీజ్ డేట్స్ అన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. అసలు ఈ వేసవికి ఎన్ని సినిమాలు వస్తాయో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ నెల గడిస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

లెక్కప్రకారం, "V" నుంచి మొదలుపెడితే.. ఉప్పెన, నిశ్శబ్దం, అరణ్య, ఒరేయ్ బుజ్జిగా, రెడ్, మిస్ ఇండియా, శ్రీకారం, సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లవ్ స్టోరీ ఇలా చాలా సినిమాలు ఈ సమ్మర్ ను నమ్ముకున్నాయి. ఇప్పుడు వీటిలో చాలా సినిమాలు వేసవి బరి నుంచి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 2-3 నెలల్లో వీటిలో ఎన్ని థియేటర్లలోకి వస్తాయనేది అనుమానమే. కరోనా కనుక చల్లారకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.