రజనీ మరీ బ్యాడ్ అయిపోతున్నాడుగా!

Superstar Rajinikanth is getting bad name
Friday, February 7, 2020 - 19:45

ఆయన సూపర్ స్టార్. రజిని సినిమాలకు వసూళ్ల వర్షం కురుస్తుంది. కథ, డైరక్టర్ తో సంబంధం లేదు. రజనీకాంత్ కటౌట్ చాలు, కాసుల పంట గ్యారెంటీ. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు రజనీకాంత్ అంటే బయ్యర్లు భయపడుతున్నారు. సినిమాలు కొనడానికి జంకుతున్నారు. కొన్న తర్వాత కిందామీద పడుతున్నారు.

ఓ హీరో సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్లకు కేవలం నష్టం మాత్రమే వస్తుంది. అదే రజనీకాంత్ సినిమా ఫ్లాప్ అయితే బయ్యర్ల జీవితాలు తలకిందులవుతాయి. ఎందుకంటే రజనీ సినిమాల రేటు ఆ స్థాయిలో ఉంటుంది మరి. తాజాగా "దర్బార్" సినిమా కూడా బయ్యర్లకు షాకిచ్చింది. భారీ మొత్తాలకు కొన్న ఈ సినిమా తమకు నష్టాలు మిగిల్చిందంటూ కొంతమంది బయ్యర్లు, కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. 

రజనీకాంత్ ఇంటి ముందు రిలే నిరాహార దీక్షలు చేశారు. చివరికి ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్లిందంటే.. ఈ సినిమా దర్శకుడు మురుగదాస్ తనకు రక్షణ కావాలంటూ ఏకంగా కోర్టులో పిటిషన్ వేశాడు. ఇక్కడ మేటర్ బయ్యర్ల ఆందోళన కాదు. రజనీకాంత్ క్రేజ్ సినిమా సినిమాకు తగ్గిపోతుందనేది కళ్లకు కడుతున్న వాస్తవం. 

పాన్-ఇండియా మూవీగా తీసిన 2.Oతో కలుపుకొని ఈమధ్య కాలంలో రజనీకాంత్ చేసిన సినిమాలన్నీ నష్టాలే మిగులుస్తున్నాయి. తెలుగులో తక్కువ రేటుకు కొన్నారు కాబట్టి తక్కువ నష్టాలతో సరిపోయింది. కోలీవుడ్ లో మాత్రం దర్బార్ ను భారీ రేట్లకు కొన్న బయ్యర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.