జీవితంలో ఫస్ట్ టైమ్ కన్ఫ్యూజ్ అయ్యాను

Suresh Babu says he was confused about Venky Mama
Monday, December 9, 2019 - 22:15

వెంకీమామ విడుదలపై నడిచిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. ప్రొఫెషనల్ అని చెప్పుకునే సురేష్ బాబే ఇలా చేస్తే, ఇక చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల సంగతేంటంటూ చాలా ట్రోలింగ్ నడిచింది. ఎట్టకేలకు ఈ మొత్తం ప్రహసనంపై సురేష్ బాబు రెస్పాండ్ అయ్యారు. తన జీవితంలో ఫస్ట్ టైమ్ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజ్ అయినట్టు ఒప్పుకున్నారు.

"నిజంగానే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ టైమ్ నేను అయోమయంలో పడ్డాను. ఎందుకంటే నా జీవితంలో చాలా జరిగాయి. చిరంజీవి సినిమా సైరా ఎర్లీగా వస్తుంది కాబట్టి, దసరా శెలవులు 5-6 రోజుల గ్యాప్ లో వద్దామని మెంటల్లీ ఫిక్స్ అయిపోయాం. ఇక అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో లాస్ట్ షెడ్యూల్ లో  వెంకటేష్ కు కాలు బెణికింది. అది ఎన్ని రోజుల్లో తగ్గుతుందో గెస్ చేయలేకపోయాం. దీపావళికి ప్రకటిద్దాం అనుకున్నాం కానీ అప్పుడు రాశి ఖన్నా డేట్స్ దొరకలేదు. అప్పటికి కోకోకోలా పెప్సీ సాంగ్ ఉండిపోయింది. ఈలోగా దీపావళి అయిపోయింది."

సంక్రాంతికి తన సినిమా వస్తుందంటూ వచ్చిన కథనాల్లో నిజం లేదంటున్నారు సురేష్ బాబు. నిజానికి తన మైండ్ లో సంక్రాంతి ఆలోచన ఎప్పుడూ లేదన్నారు. బన్నీ, మహేష్ ఆల్రెడీ రేసులో ఉన్నారని తెలిసిన తర్వాత తను ఎందుకు సంక్రాంతి కోసం  వెళ్తానంటూ కుండబద్దలుకొట్టారు.

"నవంబర్ కు రిలీజ్ చేద్దామని మా మేనేజర్లు అన్నారు. సరే, ఎప్పుడు రిలీజ్ చేద్దామనే విషయంపై మేనేజర్లతో మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ తో మేం పండక్కి వచ్చేస్తున్నామనే పుకారు వచ్చేసింది. నిజానికి సంక్రాంతి అనేది నా మైండ్ లో ఉంది. ఆల్రెడీ బన్నీ, మహేష్ సినిమాలున్నాయని నాకు తెలుసు. వాళ్లతో క్లాష్ అవ్వకూడదని నేనెప్పుడో ఫిక్స్ అయ్యాను. క్రిస్మస్ లేదా డిసెంబర్ 13న విడుదల చేయాలని నిర్ణయించుకొని మళ్లీ అమెరికా వెళ్లిపోయాను. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ మేనేజర్లను పిలిచి వాళ్ల నిర్ణయం మేరకు 13 తేదీని ఫిక్స్ చేశాం."

హాలిడేస్, వీకెండ్స్ కలిసొస్తున్నాయి కాబట్టి.. పైగా 2-3 వారాలు థియేటర్లు హోల్డ్ చేయగలిగే సత్తా తనకు ఉంది కాబట్టి.. 13కి వస్తున్నట్టు తెలిపారు సురేష్. అంతేకాదు.. పండగ టైమ్ కు కూడా కనీసం 150 థియేటర్లలో సినిమాను ఉంచే సత్తా తనకు ఉందని స్పష్టంచేశారు.