వెంకీ మామా ఎందుకీ రిలీజు డ్రామా!

Suresh Babu's unprofessional attitude about Venky Mama
Thursday, November 28, 2019 - 10:00

ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాపై అంచనాలు పెరగాలి. సినిమాలో ఎట్రాక్షన్స్ పై చర్చ జరగాలి. కానీ వెంకీమామ విషయంలో ఇవేం జరగడం లేదు. ఓ చిన్న హీరో సినిమాకు ఎలాగైతే రిలీజ్ డేట్ కోసం కిందామీద పడుతుంటారో, వెంకీమామ విడుదల కోసం అలా హైరానా పడుతోంది యూనిట్.

నిజంగా ఇది తప్పు పట్టాల్సిన విషయమే. పైగా సురేష్ బాబు మాట ఎత్తితే.. సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనలిజం ఉండాలి. హాలీవుడ్ లాగా ప్లాన్ చేసుకోవాలి అని లెక్సర్లు దంచుతారు. హాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ డేట్ ..ఏడాది ముందు అనౌన్స్ చేస్తారు. టాలీవుడ్ లో కూడా మిగతా ప్రొడ్యూసర్లు అంతా ఆరు నుంచి మూడు నెలల ముందే డేట్స్ ప్రకటిస్తున్నారు పక్కాగా. లెక్చర్లు దంచే సురేష్ బాబు మాత్రం ఇంత అన్ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తున్నారు. 

మరోసారి వెంకీమామ రిలీజ్ డ్రామాలు పీక్ స్టేజ్ కు చేరాయి. ముందు సంక్రాంతి అన్నారు, తప్పుకున్నారు. ఆ తర్వాత చాలా తేదీలు వచ్చినా ఏదీ వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా డిసెంబర్ 13న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని అంతా అనుకున్నారు. పుట్టినరోజు కాబట్టి, ఇక ఆ తేదీ నుంచి వెనక్కి రారని అంతా ఫిక్స్ అయ్యారు కూడా.

కానీ ఎప్పటికీ ప్రచారం షురూ కాకపోవడంతో అందర్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. వీటికి మరింత ఊతమిస్తూ.. డిసెంబర్ 13 కాకుండా, క్రిస్మస్ కే సినిమా వస్తుందంటూ అంతలోనే మరో వార్త. ఇలా వెంకీమామ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.

నిజానికి డిసెంబర్ 25న పెద్ద సినిమాలేం లేవు. రాజ్ తరుణ్ మూవీ మాత్రమే ఉంది. అంతకంటే 5 రోజుల ముందు సాయితేజ్, బాలయ్య సినిమాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి వెంకీమామకు వచ్చిన ఇబ్బందేం లేదు. కనీసం క్రిస్మస్ తేదీకైనా సినిమాను ఫిక్స్ చేస్తారా?