సుశాంత్ కేసు 'క్లోజింగ్' కొచ్చిందా?

Sushant Singh Rajput death case to be closed soon
Wednesday, July 15, 2020 - 10:45

సుశాంత్ ఆత్మహత్యపై సోషల్ మీడియాలో చాలా రాద్దాంతం జరిగింది. మరోవైపు అతడ్ని హత్య చేశారనే ప్రచారం కూడా నడిచింది. ఇంకోవైపు స్వయంగా కుటుంబ సభ్యులు విచారణ జరపాలని పట్టుబట్టడంతో సుశాంత్ ఆత్మహత్య కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

సుశాంత్ మరణించి సరిగ్గా నెల రోజులైంది. ఈ 30 రోజుల్లో కేసుకు సంబంధించి విచారణ మొత్తం పూర్తయినట్టు తెలుస్తోంది. 35 మంది ప్రముఖుల్ని ప్రశ్నించిన పోలీసులు వాళ్ల వాంగ్మూలాలు నమోదుచేశారు. మరోవైపు సుశాంత్ ఇంటి నుంచి కొన్ని కీలక వస్తువులు, డైరీ సేకరించి వాటి ఆధారంగా కూడా నివేదిక తయారుచేశారు.

ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కొత్తగా ఎవ్వర్నీ ఎంక్వయిరీ చేయాల్సిన అవసరం లేదంటున్నారు పోలీసులు. మరో 2-3 రోజుల్లో సుశాంత్ మరణంపై పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించబోతున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. సుశాంత్ ది ఆత్మహత్య అని నిర్థారించబోతున్నారట ముంబయి పోలీసులు. అవకాశాలు తగ్గిపోవడం, డిప్రెషన్ వంటి అంశాలు అతడి ఆత్మహత్యకు కారణాలుగా చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవ్వర్నీ నిందితులుగా చేర్చడం కానీ, రిమాండ్ లోకి తీసుకోవడం లాంటివి జరగవని తెలుస్తోంది.