ప్రధానికి సుశాంత్ చెల్లెలు లేఖ

Sushant's sister writes to PM Modi
Saturday, August 1, 2020 - 17:00

సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్ అట్టుడికిపోతోంది. రోజుకో అప్ డేట్, కొత్త ట్విస్ట్ తో ఈ కేసు పరుగులు పెడుతోంది. మొన్నటివరకు సింపతీ అందుకున్న రియా చక్రబొర్తిపై ఇప్పుడు అనుమానాలు రేకెత్తేలా కథనాలు వస్తున్నాయి. మరోవైపు కంగనాకు కూడా నోటీసులు అందాయి. ఇలా రోజుకో మలుపు తీసుకుంటున్న ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటోంది సుశాంత్ చెల్లెలు. ఈ మేరకు ఆమె ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాసింది.

"నిజం వైపు నిలబడమని నా మనసు ఎప్పుడూ చెబుతుంటుంది. మేం చాలా చిన్న సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. మా అన్నయ్యకు బాలీవుడ్ లో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు. మాకు ఇప్పటికీ అలాంటివారు ఎవ్వరూ లేరు. దయచేసి ఈ కేసుపై మీరు ఓసారి దృష్టిపెట్టాలని నా కోరిక. దీనికి సంబంధించిన ప్రతి విషయం నిష్పక్షపాతంగా, స్వచ్ఛంగా జరిగేలా చూడాలి. న్యాయం నిలబడాలని కోరుకుంటున్నాను."

ఇలా మోడీని, పీఎంవో ఆఫీస్ ను ట్యాగ్ చేస్తూ సుశాంత్ చెల్లెలు శ్వేతా సింగ్ ఓపెన్ లెటర్ రాశారు. ఈ కేసుకు సంబంధించి బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తంచేశారు. సుశాంత్ ది కచ్చితంగా మర్డర్ అంటూ 26 పాయింట్లతో కూడిన డాక్యుమెంట్ ను ఆయన రిలీజ్ చేశారు.