ఇటలీలో టాలీవుడ్ గాయనికి నరకం

Sweta Pandit stuck in Italy, coronavirus outbreak
Wednesday, March 25, 2020 - 19:30

ప్రస్తుతం ఇటలీలో కరోనా వైరస్ మరణమృదంగం వాయిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 8వేల మందికి పైగా మరణించారు. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి, ఇటలీలోనే ఎక్కువ ప్రాణాలు బలితీసుకుంది. ఇలాంటి దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతోంది ఓ టాలీవుడ్ సింగర్. ఆమె పేరు శ్వేతాపండిట్.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ గీతాలు ఆలపించిన ఈ సింగర్, ఇటలీలో సెటిలైంది. ప్రస్తుతం అక్కడున్న భయానకమైన పరిస్థితిని సోషల్ మీడియాలో వివరించింది. ప్రతి రోజూ అంబులెన్స్ సైరన్ తోనే నిద్రలేస్తున్నానని అంటోంది శ్వేత. ఇటలీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకునేలోపే అంతా జరిగిపోయిందని, వేలల్లో మరణాలు సంభవించాయని అంటోంది.

ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పట్నుంచి తను ఇంటి నుంచి బయటకు రాలేదని, ఇప్పటికీ ఇంట్లోనే ఉంటున్నానని.. తన ఫ్యాన్స్, తల్లిదండ్రుల ప్రేమ వల్ల తను ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానని చెప్పుకొచ్చింది శ్వేతాపండిట్. దాదాపు 5 నిమిషాల వీడియోను ఆమె పోస్ట్ చేసింది. ఇటలీ దుర్భర పరిస్థితిని కళ్లకుకట్టింది.

కొత్త బంగారు లోకం సినిమాలో "నేనని నీవని", సైజు జీరో సినిమాలో "మెల్ల మెల్ల", సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో సమంత సోలో సాంగ్ ఇలా పలు హిట్ సాంగ్స్ పాడింది శ్వేత.