సైరాతో అమెజాన్ కు సరికొత్త టెన్షన్

Sye raa, Amazon hoping big numbers
Saturday, November 23, 2019 - 19:00

అమెజాన్ మరో రిస్క్ చేసింది. భారీ మొత్తానికి సైరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసింది. చిరంజీవి సినిమా కొంటే రిస్క్ ఎందుకనే అనుమానం రావొచ్చు. కానీ అమెజాన్ టెన్షన్ పడ్డానికి, క్రిటిక్స్ ఆసక్తిగా పరిశీలించడానికి ప్రధాన కారణం సాహో సినిమా.

ప్రభాస్ నటించిన సాహో సినిమాను భారీ మొత్తానికి దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ. సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా, అమెజాన్ లో హిట్ అవుతుందని భావించింది. తీరా డిజిటల్ స్ట్రీమింగ్ లో పెట్టిన తర్వాత ఆశించిన స్థాయిలో సాహోకు రెస్పాన్స్ రాలేదు. వీక్షకులు వెల్లువెత్తుతారనుకుంటే, అరకొరగా వ్యూయర్ షిప్ వచ్చింది.

ఇప్పుడు అదే టెన్షన్ సైరాకు కూడా పట్టుకుంది. దాదాపు 50 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుక్కుంది అమెజాన్. తాజాగా సినిమాను తన యాప్ లో పెట్టింది. వీకెండ్ కాబట్టి ఈరోజు, రేపు సైరాను ఇళ్లల్లో చాలామంది చూస్తారని అమెజాన్ భావిస్తోంది. 50 కోట్లు పెట్టి కొన్న సినిమాను ఆ స్థాయిలో వ్యూస్ రాకపోతే నష్టమే. ఎందుకంటే డిజిటల్ వేదికలపై రోజులు గడిచేకొద్దీ ప్రేక్షకులకు సినిమా చూడాలనే ఉత్సాహం తగ్గిపోతుంది. అది క్లాసిక్ అయితే తప్ప.

మరోవైపు టాలీవుడ్ నిర్మాతలకు కూడా సైరా టెన్షన్ పడుతోంది. అమెజాన్ అనేది ఇప్పుడు నిర్మాతలకు బంగారు బాతు. సినిమా బడ్జెట్ లెక్కలేసుకున్నప్పుడే అమెజాన్ నుంచి ఇంత మొత్తం వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ఇన్నాళ్లు అలానే జరిగింది. సైరా, సాహో ప్రభావం గట్టిగా పడితే మాత్రం తెలుగులో అమెజాన్ తన జోరు తగ్గించే అవకాశం ఉంది. అందుకే సైరా వ్యూయర్ షిప్ కోసం అంతా వెయిటింగ్.