సైరా: ఇదే ఫైన‌ల్ లుక్‌

Sye Raa: This is Final Look for Megastar
Monday, December 4, 2017 - 19:30

ఈ వార‌మే మొద‌ల‌వుతోంది "సైరా" రెగ్యుల‌ర్ షూటింగ్‌. 61 ఏళ్ల మెగాస్టార్ ఈ సినిమా కోసం అన్ని విధాల రెడీ అయ్యారు. పాత్ర‌కి కావాల్సిన రీతిలో గ‌డ్డం ఫుల్లుగా పెంచారు. ఫిట్‌నెస్ కోసం ప్ర‌త్యేక‌మైన ట్ర‌యినింగ్ తీసుకొని బాడీని సంసిద్ధం చేశారు మెగాస్టార్‌. పైన క‌నుప‌డుతున్న ఫోటోలో ఉన్న‌ట్లే క‌నిపిస్తార‌ట‌ సైరాలో. కాక‌పోతే నెత్తిన పాగా, కొంత మేక‌ప్‌తో కూడిన గెట‌ప్ ఉంటుంది.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనే యోధుడి పాత్ర పోషిస్తున్నారు చిరు. ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి పాలిగ‌ర్ నాయ‌కుడు. ఉయ్యాలవాడ నుంచి పాలించాడు. ఈ గ్రామం ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లాలో ఉంది. బ్రిటీషు అధికారుల‌కి వ్య‌తిరేకంగా పోరాడి వీర‌మ‌ర‌ణం చెందాడు ఉయ్యాలవాడ న‌ర్సింహారెడ్డి. ఆ యోధుడి పాత్రకు త‌గ్గ‌ట్లు మెగాస్టార్ తన బాడీని మార్చుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా రెడీ చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్‌లోనే షూటింగ్ మొద‌ల‌వుతుంది. "సైరా"కి నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌. రాజీవ‌న్ ఈ సినిమాకి సూప‌ర్ సెట్స్ వేశాడ‌ట‌. ఎంత ఖ‌ర్చు అయిన ఫ‌ర్వాలేద‌న్న‌ట్లుగా తీయ‌నున్నారు.