మళ్లీ గోడలపై సైరా పోస్టర్లు

Sye Raa getting premiered on TV
Tuesday, January 14, 2020 - 22:45

సైరా సినిమా వచ్చి చాన్నాళ్లయింది. వంద రోజులు కూడా పూర్తయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లోకి కూడా వచ్చేసింది. కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా మరోసారి సైరా పోస్టర్లు తెలుగు రాష్ట్రాల్లో దర్శనమిస్తున్నాయి. దీని వెనక ఓ కారణం ఉంది. రేపు (15, జనవరి) టీవీల్లో సైరా సినిమా ప్రసారం అవుతుంది. అందుకే ఈ పబ్లిసిటీ.

ఈమధ్య థియేట్రికల్ రిలీజ్ తో సమానంగా, టీవీలో తొలిసారి వేసినప్పుడు కూడా ప్రచారం గట్టిగా చేస్తున్నారు. మొన్నటికిమొన్న ఇస్మార్ట్ శంకర్ సినిమాను జీ తెలుగు ఛానెల్ లో వేసినప్పుడు ఏపీ,నైజాం మొత్తం పోస్టర్లు వేశారు. అది మంచి రిజల్ట్ ఇచ్చింది. రేటింగ్ దుమ్ముదులిపింది. అందుకే ఇప్పుడు జెమినీ టీవీ, సైరా విషయంలో అదే ఫార్ములా ఫాలో అవుతోంది. మరోసారి సైరా పోస్టర్లతో తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తింది.

సంక్రాంతి కానుకగా రేపు సాయంత్రం జెమినీ టీవీలో సైరా సినిమా ప్రసారం అవుతుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమాకు ఏ స్థాయిలో రేటింగ్ వస్తుందనేది డౌటనుమానం. ఎందుకంటే, సైరా మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో వచ్చేసింది. థియేటర్లలో చూడని కొద్దిమంది జనాలు కూడా అమెజాన్ లో ఈ సినిమా చూసేశారు. ఈ నేపథ్యంలో టీవీల్లో ఈ సినిమాను ఎంత మంచి మళ్లీ చూస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే పండగ సీజన్ కావడంతో ఇంటిల్లిపాదీ సైరా చూసే ఛాన్స్ ఉంది. అదే కనుక జరిగితే జెమినీకి పండగే.